Jul 27,2023 00:34

అధికారిని ప్రశ్నిస్తున్న ఎంపిపి జగన్మోహన్‌

ప్రజాశక్తి- కె.కోటపాడు
జగనన్న మహిళా క్రాంతి పథం ద్వారా డ్వాక్రా మహిళలకు సరఫరా చేసిన పండ్ల జాతి మొక్కల పంపిణీలో భారీ అవినీతి జరిగిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మండల సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు డిమాండ్‌ చేశారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయ సమావేశం మందిరంలో ఎంపీపీ రెడ్డి జగన్మోహన్‌ అధ్యక్షతన మండల పరిషత్తు సమావేశం జరిగింది. వెలుగు ఎపిఎం శ్రీలక్ష్మి మాట్లాడుతూ మండలంలోని ఐదుగురు వెలుగు సీసీల ద్వారా మామిడి, జీడి, సీతాఫలం, నిమ్మ, సపోటా, జామి, కొబ్బరి తదితర మొక్కలను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ సమయంలో వైస్‌ ఎంపిపి రొంగలి సూర్యనారాయణ, చౌడువాడ ఎంపీటీసీ రాజేష్‌ మాట్లాడుతూ కొబ్బరి మొక్క రూ.69కు ఇవ్వాల్సి ఉండగా రూ.120 వసూలు చేశారన్నారు. మామిడి, సపోటా తదితర మొక్కలకు కూడా రెట్టింపు సొమ్ము వసూలు చేశారని, ఇదేమని అడిగితే వెలుగు సీసీలు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆరోపించారు. కేవలం మొక్కల పంపిణీలోనే లక్షలాది రూపాయలు చేతులు మారాయన్నారు.
హౌసింగ్‌ ఏఈ రవికుమార్‌ మాట్లాడుతూ మండలంలో 1500 గృహాలు నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు 490 ఇల్లు పూర్తయినట్లు చెప్పారు. సకాలంలో హౌసింగ్‌ పేమెంట్లు ఇవ్వకపోవడంతో పేదలు ఇల్లు నిర్మించలేకపోతున్నారని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. నిబంధనల మేరకు పేమెంట్లు ఇస్తున్నట్లు ఏఈ సమాధానం ఇవ్వగా అందుకు సంతృప్తి చెందని ఎంపీపీ, ఇతర సభ్యులు సక్రమంగా పనిచేయని ఏఈ రవికుమార్‌ను సరెండర్‌ చేయటానికి మండల పరిషత్తు సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో చౌడువాడ పరిసర 10 గ్రామాల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. చౌడువాడలో సుమారు 3000 కనెక్షన్‌లు ఉన్నాయని, పవర్‌ లోడ్‌ ఎక్కువై ప్రతిసారీ ట్రిప్‌ అవుతుందని, దీన్ని సరి చేయడానికి విద్యుత్‌ సిబ్బంది అందుబాటులో ఉండాలని సర్పంచ్‌ దాడి ఎరుకు నాయుడు కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీవో కె.శచిదేవి, తహశీల్దారు రమేష్‌బాబు, ఈవోపిఆర్డి ప్రసాద్‌, వ్యవసాయ అధికారి సోమశేఖర్‌, మండల ఇంజనీర్‌ బాలాజీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.