* డ్వామా పీడీ జి.వి చిట్టిరాజు
శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల పరిరక్షణకు ప్రత్యేక దృష్టిసారించాలని డ్వామా పీడీ జి.వి చిట్టిరాజు సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని శిలగాం శింగువలసలో పళ్ల తోటల పెంపకం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు అంతర పంటలు వేసుకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందాలని సూచించారు. ప్రతి మొక్క బతికే విధంగా సంరక్షణ చర్యలను చేపట్టాలని ఉపాధి హామీ ద్వారా మూడేళ్ల పాటు మొక్కల సంరక్షణకు అవసరమైన నిధులు, ఎరువులను అందజేయనున్నట్లు తెలిపారు. ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా చెరువులు పంటకాలువ గట్లపై మొక్కల పెంపకం పనులతో పాటు రోడ్లకు ఇరువైపులా రెవెన్యూ ప్లాంటేషన్ వ్యక్తిగత పళ్లతోటల పెంపకం వంటి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. భూమిపై మొక్కల శాతం తగ్గడం వల్ల మాత్రమే ఉష్ణోగ్రతలో గణనీయంగా మార్పులు వస్తున్నాయని, ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలన్నారు. కార్యక్రమంలో ఎపిఒ సీతారాం, ఇసి బాలముకుంద బాబు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.










