ప్రజాశక్తి-మైలవరం : మొక్కజొన్నలను ప్రభుత్వం కల్పించిన గిట్టుబాటు ధరకే ఆర్బికే ల ద్వారా కొనుగోలు చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు.స్థానిక ఏఎంసీ లో ఆరబోసిన మొక్కజొన్నలను శుక్రవారం రైతు సంఘం, ప్రజాసంఘాల నాయకులు పరిశీలించారు. రైతులను వివరాలడిగి తెలుసుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న మొక్కజొన్నలను కొనుగోలు చేయకపోవడంతో రైతులు 1500 నుండి 1600కే దళారులకు అమ్ముకో వాల్సిన పరిస్థితి నెలకొంది అన్నారు.దీనితో పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఉందన్నారు. ప్రారంభంలో 2300 ఉన్న ధర ను దళారులు కుమ్మక్కై మొక్కజొన్న ధరను అమాంతం తగ్గించేసారన్నారు. దళారును నివారించి ప్రభుత్వ ప్రకటించిన క్వింటాకు రూ.1962 మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రోజుల తరబడి మార్కెట్ యార్డ్ లోనే రైతులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని, త్వరితగతిన రైతుల వద్ద ఉన్న మొక్కజొన్నలను కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి వజ్రాల వెంకటరెడ్డి,సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్ సుధాకర్,రైతు సంఘం నాయకులు మోహన్ రావు, చరణ్, దీపక్, శేషయ్య, ఐలు నాయక్, రమేష్ బాబు,తదితరులు పాల్గొన్నారు.










