ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లె సబ్ డివిజన్ పరిధిలోని కురుస్తున్న వర్షాలతో మొక్కజొన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ ఏడిఏ సయ్యద్ అత్తర్ హుస్సేన్ కోరారు. బేతపూడి గ్రామంలో అకాల వర్షాల కారణంగా నీట మునిగిన మొక్కజొన్న పొలాలను ఆయన పరిశీలించారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో టార్పాలిన్ పట్టాలతో రైతులు సిద్ధంగా ఉండాలన్నారు. కోత కోసి కల్లాలలో ఉన్న మొక్కజొన్నను గుట్టగా ఒకచోట చేర్చుకుని పట్టాలతో కప్పి వేసుకోవాలన్నారు. పొలాలలో వర్షపు నీరు నిల్వ లేకుండా బయటకు పంపే మార్గాలు చూడాలన్నారు. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు సబ్ డివిజన్ పరిధిలో 7,600 ఎకరాల్లో జొన్న, మొక్కజొన్న తడిచినట్లు పేర్కొన్నారు. ఎక్కువగా వర్షపు నీరు ఉండి పంట నష్టం జరిగి ఉంటే కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాల్లో ఉండే అగ్రికల్చర్ అసిస్టెంట్లను కలిసి రైతులు తమ పేర్లను నమోదు చేయించుకోవాలని తెలిపారు. వరిపంటకు సంబంధించి ధాన్యం రంగు మారినా, అదేవిధంగా మొక్కజొన్న పంటకు సంబంధించి ఉన్న మొక్కజొన్న కండెలు కుళ్లి, పాడైపోయిన రైతులు వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడిఏ తెలిపారు. పూర్తి నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అన్నారు.










