
ప్రజాశక్తి - మక్కువ : ప్రస్తుత రబీ సీజన్లో మొక్కజొన్న రైతుకు ఆది నుండే కష్టాలు ఎదురయ్యాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పంట ఎదుగుదలకు వచ్చి 15 రోజులు కాకముందే కత్తెర పురుగు ఆశించి మొక్కజొన్న రైతులను అవస్థలకు గురిచేస్తుంది. ఇప్పటివరకు మండలంలో దాదాపు వందెకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తుండగా మరికొన్ని ఎకరాల్లో ఇంకా విత్తనాలు వేయాల్సి ఉంది. ఇప్పటికే ఆరుతడి పంటలకు అవసరమైనంత వర్షం పడకపోవడంతో ఓవైపు ఎండిపోతున్న పంటను చూసి ఆందోళన చెందుతుంటే మరోవైపు చీడపీడల బెడదతో రైతులు అల్లాడిపోతున్న పరిస్థితి ఏర్పడింది. మొక్కజొన్న ఎదుగుదలకు వస్తున్న తరుణంలో కత్తెర పురుగు సోకి కోలుకోని దెబ్బతీస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తమకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన చేయూత అందడం లేదని మొక్కజొన్న రైతులు అంటున్నారు. ఆరుతడి పంటలకు సంబంధించి ఎరువులు, పురుగు మందులను ప్రభుత్వం సబ్సిడీపై అందించాలని రైతులు కోరుతున్నారు.
నివారణ ఇలా...
ప్రస్తుత రబీ కాలంలోమొక్కజొన్న సాగు వడివడిగా సాగుతుందని వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు మొక్కజొన్న పంటలపై కత్తెర పురుగు ఆశించిందన్న అంశంపై 'ప్రజాశకి'్త ఆయన దృష్టికి తీసుకువెళ్లింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కత్తెర పురుగును నివారించవచ్చన్నారు. ఎకరాకు అరకిలో వేపనూనెలో వంద గ్రాముల ఇమోమెట్ బెంజోయట్‌ను కలిపి కత్తెర పురుగు ఆశించిన పంటలపై పిచికారీ చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఆరుతడి పంటలకు సంబంధించి ఎరువులు పురుగుల మందులు సబ్సిడీలు రాలేదని ఆయన తెలిపారు
గతంలో సబ్సిడీ ఉండేది..
గత ప్రభుత్వ హయాంలో మొక్కజొన్న పంటలకు ఆశించే కత్తెర పురుగు నివారణకు సబ్సిడీపై వేప నూనె ఇమామేట్ బెంజోయట్ పురుగుమందు ఉండేదని రైతులు అంటున్నారు. 65 రూపాయలకే 100 గ్రాముల హిమాయత్ బెంజో ఎట్ పురుగుమందు లభించేదని, ప్రస్తుతం అదే మందు 100 గ్రాములు సుమారు రూ.270కు కొనాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. మొక్కజొన్న ప్రారంభం నుండి పంట కోత వరకు సుమారు పదిసార్లు ఈ మిశ్రమాలను వినియోగించాల్సి ఉంటుందని వారు తెలిపారు. దీంతో తమపై ఎంతో ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సబ్సిడీతో వీటిని పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు.
కత్తెర పురుగు నివారణకు అగ్ని అస్త్రం
పాచిపెంట : మొక్కజొన్న నాటిన పది రోజుల నుండే కత్తెర పురుగుకు గురవుతుందని, దీని నివారణకు అగ్ని అస్త్రం తయారు చేసుకుని పిచికారీ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కె.తిరుపతిరావు అన్నారు. మండలంలోని పాంచాలిలో గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీనుతో కలిసి మొక్కజొన్న పంటను శనివారం పరిశీలించారు. అనంతరం సిఆర్‌పి తిరుపతినాయుడు ఆధ్వర్యంలో కత్తెర పురుగు నివారణకు అగ్ని అస్త్రం తయారీని రైతులకు వివరించారు ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ మొక్కజొన్న నాటిన పది రోజుల నుండి కత్తెర పురుగు ఆశిస్తుంద,ని ప్రస్తుత రబీ సీజన్లో ఈ పురుగు చాలా ఉధృతంగా ఉందని అన్నారు. పంట మార్పిడి లేకుండా ప్రతి సీజన్లోనూ మొక్కజొన్న పంటను వేస్తున్న క్షేత్రాల్లో ఈ పురుగు ఉధృతి మరింత ఎక్కువగా ఉందని అన్నారు. దీని నివారణకు ఇమామెక్టిన్ బెంజోయేట్, వేపనూనెతో పాటుగా అతి ఖరీదైన డెలిగేట్, కొరాజన్ వంటి మందులను రైతులు వినియోగిస్తున్నారని అన్నారు. దీనివల్ల ఒకసారి పిచికారీకి ఎకరాకు రూ. 1500 వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. అదే కత్తెర పురుగును ముందుగానే గుర్తించి ప్రకృతి సేద్య పద్ధతుల్లో అగ్ని అస్త్రం పిచికారీ తక్కువ వ్యయంతో అరికట్టుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో రైతులు ఐ సి ఆర్ పి లు పాల్గొన్నారు