ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : జిల్లా పరిషత్ సమావేశంలో పలువురు జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు సమస్యలను ప్రస్తావించారు. రొంపిచర్ల జెడ్‌పిటిసి నారాయణరెడ్డి మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలులో ఎకరాకు కేవలం 14 క్వింటాళ్లను కొనుగోలు చేస్తున్నారని 35 క్వింటాళ్లవరకు దిగుబడి వచ్చిన రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. సాంకేతిక సమస్య వల్ల కేవలం 14 క్వింటాళ్లు అని ఆన్‌లైన్‌లో నమోదైందని, వీటిని వెంటనే కొనుగోలు చేస్తామని పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి తెలిపారు. అచ్చంపేట జెడ్‌పిటిసి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాలు సరఫరా చేసినట్టు నిర్ధారణ అయినా రైతులకు న్యాయం జరగలేదన్నారు. భట్టిప్రోలు జెడ్‌పిటిసి మాట్లాడుతూ అధిక వర్షాలక నష్టపోయిన మొక్కజొన్న రైతులకు పరిహారం అందడం లేదని ప్రస్తావించగా బాపట్ల కలెక్టర్ రంజిత్‌బాషా మాట్లాడుతూ అందరికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అమరావతి ఎంపిపి హనుమంతరావు మాట్లాడుతూ మిర్చి విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తు న్నారని, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టి స్తున్నారని తెలిపారు. అచ్చంపేట మండలంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయినా వారికి వైఎస్సార్ బీమా అందలేదని జెడ్‌పిటిసి ప్రతాపరెడ్డి తెలిపారు. భట్టిప్రోలు, రెంటచింతల పిహెచ్‌సిలలో వైద్య సిబ్బంది కొరతపై సభ్యులు ప్రస్తావించారు. చెరుకుపల్లి జెడ్‌పిటిసి పావని మాట్లాడుతూ జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందన్నారు. పాడిపశువు చనిపోతే రూ.30 వేలు ఇస్తున్నారని, దీనిని లక్షకు పెంచాలని పలువురు జెడ్‌పిటిసిలు కోరారు. నల్లపాడులోని గొర్రెల మండి రైతుల నుండి రూ.200 వసూలు చేస్తున్నారని, వారికి అనుమతులు న్నాయా? లేదా? తెలపాలని అమరావతి ఎంపిపి హనుమంతరావు కోరారు. నాడు-నేడు పనుల్లో ముందుగానే గ్రానైట్ కొనుగోలు చేశారని కానీ పనులు జరగడం లేదని పెదకాకాని ఎంపిపి చెప్పారు.
సమావేశంలో పాల్గొన్న జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు










