Mar 05,2023 00:47
ముప్పవరం గ్రామంలో మొక్కజొన్న పైరును పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

ప్రజాశక్తి-పంగులూరు: పంగులూరు మండలంలోని కొండమూరు, ముప్పవరం గ్రామాల్లోని మొక్కజొన్న పైరును శాస్త్రవేత్తలు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఒంగోలు డాట్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ జి రమేష్‌ రైతులతో మాట్లాడుతూ, 30 రోజుల మొక్కజొన్న పైరుకు 45 కిలోల యూరియా, 20 కిలోల పొటాష్‌ మొక్క మొదలులో వేయటం వలన, మొక్క ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. కాండం తొలుచు పురుగుకు ఒక ఎకరానికి నాలుగు కిలోలు 3జి గుళికలు వేయటం వలన పురుగును నివారించవచ్చని అన్నారు. కత్తెర పురుగుకు ఒక ఎకరానికి 100 గ్రాముల ప్రోక్లిం పిచికారీ చేయటం వలన పురుగు నివారణ చేయవచ్చని అన్నారు. కలుపు సమస్య అధికంగా ఉంటే ఒక ఎకరానికి టిన్జర్‌ 34 మి.లీ వేయటం వలన కలుపు సమస్యను నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డిడిఏ ఎం విజయనిర్మల, మార్టూరు ఏడిఏ ఎం శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డి, గ్రామ వ్యవసాయ సహాయకులు ఏ దిల్‌ జా, జాగర్లమూడి దినేష్‌, రైతులు పాల్గొన్నారు.