Mar 01,2023 00:03
కొండమంజులూరు గ్రామంలో మొక్కజొన్న పైరును పరిశీలిస్తున్న, మండల వ్యవసాయ అధికారి, రైతులు

ప్రజాశక్తి-పంగులూరు: మొక్కజొన్న నకిలీ విత్తనాల విషయం గురించి నివేదిక తయారు చేసి, ఉన్నతాధికారులకు పంపిస్తానని మండల వ్యవసాయ శాఖ అధికారి కే సుబ్బారెడ్డి అన్నారు. మండలంలోని కొండమంజులూరు గ్రామానికి చెందిన బత్తుల ఆంజనేయులు, కొలకలూరి ఏసోబు కు చెందిన మొక్కజొన్న పొలాలను మంగళవారం మధ్యాహ్నం, మండల వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డి పరిశీలించారు. నకిలీ విత్తనాలు కారణంగా మొక్కజొన్న పైరు, ఎదుగు బొదుగు లేకుండా, పైరు పసుపు రంగులోకి మారి, ఆకులు ముడతకొస్తున్నాయని, రైతులు నష్టపోతున్నారని, పత్రికల్లో వచ్చిన వార్తకు స్పందించిన మండల వ్యవసాయ అధికారితో పాటు మరికొందరు అధికారులు మంగళవారం ఆ పైర్లను పరిశీలించేందుకు వచ్చారు. రైతు సంఘం నాయకులు, రైతులతో కలిసి ఆయన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 నుంచి, 50 రోజులలోపు వయసు ఉన్న మొక్కజొన్న కంకి దశకు రావాలని, కనీసం ఐదు అడుగుల ఎత్తు పైరు ఉంటే, దిగుబడి 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. కానీ బత్తుల ఆంజనేయులు, కొలకలూరు ఏసోబు భూముల్లో ఉన్న మొక్కజొన్న పైరు భారతి 756 రకం, 2-3 అడుగులు ఎత్తు మధ్యలోనే ఉందని చెప్పారు. దాసరి వెన్ను కూడా వచ్చిందని అన్నారు. ఈ విధంగా రావడం వల్ల కండె బలహీనంగా ఉండి, దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని సుబ్బారెడ్డి తెలిపారు. పైరు ఈ విధంగా ఉండటానికి కారణాలు తెలుసుకునేందుకు పై అధికారులకు నివేదిక పంపుతానని అన్నారు. నివేదిక ఆధారంగా శాస్త్రవేత్తలు పొలాన్ని పరిశీలించి, విత్తనంలో ఏదైనా జన్యుపరమైన తేడా ఉందని గమనించి, ఆ విధమైన రిపోర్టు ఇస్తే రైతులకు వచ్చిన నష్టంపై కంపెనీ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి తల్లపనేని రామారావు మాట్లాడుతూ, విత్తన కంపెనీలు తయారు చేసే నకిలీ విత్తనాలు కారణంగా, రైతులు ప్రతిఏటా నష్టపోతున్నారని, మొక్కజొన్నలోనే కాకుండా మిర్చి, బెండ మొదలైన పంటల్లో కూడా నకిలీల బెడద ఉందని, ప్రభుత్వం విత్తన కంపెనీలపై దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు. అధికారులు కంపెనీలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు వీరవల్లి కృష్ణమూర్తి, బాధ్యులు గుడిపాటి మల్లారెడ్డి, రైతులు బత్తుల ఆంజనేయులు, కొలకలూరి ఏసోబు, సరిమల్ల సుబ్బయ్య, బైటమంజులూరు వ్యవసాయ అసిస్టెంట్‌ గురజాల పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.