Apr 21,2023 00:44
పంగులూరు మండల వ్యవసాయ అధికారికి వినతిపత్రం అందజేస్తున్న రైతులు, రైతు సంఘం నాయకులు

ప్రజాశక్తి-పంగులూరు: పంగులూరులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వెంటనే ఏర్పాటు చేయాలని రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పంగులూరు మండల వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారెడ్డికి గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాయిని వినోద్‌ బాబు మాట్లాడుతూ రైతులు పండించిన పంటను ఒక్క విత్తనం కూడా వదలకుండా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, విత్తనం ఇచ్చేది మొదలుకొని, పంట కొనుగోలు చేసే వరకు రైతు భరోసా కేంద్రాలు రైతులకు అండగా నిలుస్తాయని ముఖ్యమంత్రి చెప్పిన మాటలు అమలకు నోచుకోవటం లేదని అన్నారు. ప్రైవేట్‌ వ్యాపారులంతా సిండికేట్‌ అయ్యి, రైతు దగ్గరకు సరుకు వచ్చే సమయంలో ధరను పూర్తిగా తగ్గించి వేస్తున్నారని అన్నారు. 10 రోజుల క్రితం క్వింట 2,200 రూపాయలు పలికిన మొక్కజొన్న, ప్రస్తుతం 1,750 రూపా యలకు దిగజార్చారన్నారు. రైతులు క్వింటాకు 450 రూపాయలు చొప్పున నష్టపోవాల్సి వస్తుందని, ఎకరాకు 15 వేల రూపాయలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా శనగలు కొనుగోలు చేసేందుకు 25 రోజుల క్రితం ఈ ప్రాంతంలోని పంగులూరు, చందలూరు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని, ఇంతవరకు ఒక్క విత్తనం కూడా కొనుగోలు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే మొక్క జొన్నలను, శనగలను కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు ఇంటూరి శ్రీనివాసరావు, ఆదుం సాహెబ్‌, గొట్టిపాటి ఆదినారాయణ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
మార్టూరు రూరల్‌: మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం వాటిని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని అట్టహాసంగా ప్రకటించి నేటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవటం దారుణమని రైతు సంఘం మండల కార్యదర్శి వీరవల్లి కృష్ణమూర్తి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్టూరు వ్యవసాయ సబ్‌ డివిజన్‌ పరిధిలోని సంతమాగులూరు, బల్లికురవ, జె పంగులూరు, మార్టూరు మండ లాల రైతులు తాము పండించిన మొక్కజొన్న పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో పండిం చిన పంటలపై చేసిన అప్పులు తీర్చుకోవడానికి గత్యంతరం లేక ప్రైవేట్‌ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. సిఐటియు జిల్లా నాయకులు బత్తుల హనుమంతరావు, గొట్టిపాటి శేషాద్రి, బోడెంపుడి సూరిబాబు, ఎనికపాటి రాంబాబు పాల్గొన్నారు.