May 03,2023 22:21

ప్రజాశక్తి - పెదవేగి
          మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని, అకాల వర్షాలకు తడిసిన మొక్కజొన్నను కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి డిమాండ్‌ చేశారు. బుధవారం మండలంలోని అమ్మపాలెం, భోగాపురం, దుగ్గిరాల గ్రామాల్లో సిపిఎం, ఎపి రైతు సంఘం నాయకులు పర్యటించి తడిసిన మొక్కజొన్నను పరిశీలించారు. పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని నినాదాలు చేస్తూ అమ్మపాలెంలోని మొక్కజొన్న కల్లాల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎ.రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించి మొక్కజొన్న పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ జిల్లాలో పెదవేగి, లింగపాలెం, చింతలపూడి, కామవరపుకోట, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, చాట్రాయి, ముసునూరు తదితర మండలాల్లో వేలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట కల్లాల్లో ఉండిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌ రూ.1962 కాగా వ్యాపారులు రూ.1600కే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. వర్షాల నుండి పంటలను కాపాడుకునేందుకు సబ్సిడీపై టార్ఫాలిన్లు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం మండల కన్వీనర్‌ చందు సత్తిబాబు, మొక్కజొన్న రైతు మండపాక వెంకటేశ్వరావు, సిపిఎం నాయకులు పి.ఆదిశేషు, జె.గోపి, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు.