Nov 16,2023 20:59

ప్రజాశక్తి - ఆకివీడు
ఆకివీడులో చెత్త సమస్యను పరిష్కరించాలని కోరుతూ కొల్లేరు దిగువనున్న 10 గ్రామాల ప్రజలు, సిపిఎం నాయకులు శ్రేణులు గురువారం మరోసారి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా డంపింగ్‌ వద్ద శిబిరం ఏర్పాటు చేసుకుని చెత్త వేయకుండా వాహనాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, సిపిఎం నేతలు మాట్లాడారు. నగర పంచాయతీ రెండు చోట్ల చెత్త డంపింగ్‌ చేస్తోందని తెలిపారు. గుమ్ములూరు రోడ్డులోని తహశీల్దార్‌ కార్యాలయం వెనుక భాగంలో చంద్రబాబు నాయుడు నగర్‌ కాలనీ పక్కన డంపింగ్‌ కేంద్రం ఉండగా, సిద్ధాపురం రోడ్డులో చినకాపవరం డ్రెయిన్‌ ఆనుకుని మరో డంపింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే సిద్ధాపురం వద్ద వేస్తున్న చెత్త రోడ్డుకు అడ్డంగా వచ్చేయడంతో వెళ్లే దారిలేక గతంలో గతంలో రెండుసార్లు ఆందోళన చేసినట్లు తెలిపారు. ధర్మాపురం, సిద్ధాపురం, చిన్నమిల్లిపాడు, కాలింగ్‌ గూడెం, రాజుపేట, కోళ్లపర్రు, కొల్లేరు తదితర గ్రామాలకు ఇది మార్గం కావడంతో దిగు కొల్లేటి చేపల చెరువులకు వెళ్లేందుకు ఎరువుల లారీలు ఎగుమతి, దిగుమతులకు ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. రోడ్డుపై చెత్త ఉండడంతో వెళ్లేదారి లేదన్నారు. అప్పుడు ఆందోళన చేయడంతో అధికారులు చెత్త డంపింగ్‌ నిలుపుదల చేసి తహశీల్దార్‌ కార్యాలయం వెనుక వేశారని తెలిపారు. అయితే అక్కడ స్థలం చాలకపోవడంతో మరలా ఇక్కడ వేస్తున్నారని తెలిపారు. దీంతో నిరసన తెలిపామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సంఘటనా స్థలానికి తహశీల్దార్‌ విజయలక్ష్మి, కమిషనర్‌ కృష్ణమోహన్‌ చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. వారు వినకపోవడంతో ఫైర్‌ ఇంజిన్‌ తెప్పించి చెత్తకు అంటించిన నిప్పును ఆర్పారు. అనంతరం గ్రామస్తులు రాస్తారోకో విరమించారు. సిద్ధాపురం గ్రామ సర్పంచి చిట్టిబాబు, ఉపసర్పంచి ఐ.నారాయణరాజు, గ్రామస్తులు సత్యనారాయణరాజు, సూరపరాజు, కృష్ణ, బాబు, సిపిఎం నాయకులు కె.తవిటినాయుడు, బివి.వర్మ, సందక సూరిబాబు, గేదెల ధనుష్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.