Mar 29,2023 00:14

గ్రామ సభలో మాట్లాడుతున్న ఎంపిపి కారం లక్ష్మి

ప్రజాశక్తి- విఆర్‌.పురం
భూమికి భూమి కోరుతున్న వారికి అన్నీ అనువుగా ఉండే భూమి చూపించాలని, రామవరం పంచాయతీ వెంకన్న గూడెం గ్రామస్తులకు 41.15 మొదటి ప్రాధాన్యత ఇచ్చి అందరికీ పరిహారం, పునరావాసం చెల్లించాలని విఆర్‌ పురం ఎంపీపీ కారం లక్ష్మి, జెడ్పిటిసి వాళ్ళ రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం జరిగిన గ్రామసభలో అధికారులు గ్రామాల వారీగా వివరాలను, పిడిఎఫ్‌ డేటా ఆధారంగా నిర్వాసిత కుటుంబాలను చదివి వినిపించారు. అనంతరం తహశీల్దారు మాట్లాడుతూ ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇచ్చిన గ్రామాలన్నింటికీ సాధ్యమైనంత వరకు పునరావాసం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పలువురు నాయకులు, నిర్వాసిత గిరిజనులు మాట్లాడుతూ భూమికి పరిహారం, డికెటి పట్టాలను పరిశీలించి తమ సాగు భూములకు ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. దీనిపై తహశీల్దారు మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పారు. అనంతరం వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాలను ఆర్‌ అండ్‌ ఆర్‌ అధికారులకు గిరిజనులు అందజేశారు. ఈ గ్రామసభలో చొపల్లి సోములగూడెం గ్రామస్తులు తమకు కూడా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ సర్పంచ్‌ కారం బుచ్చమ్మ, పంచాయితీ కార్యదర్శి ఎఎస్‌ తాతారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అవగాహన లేకుండా ఎలా గ్రామసభ నిర్వహిస్తారు
చింతూరు : అధికారులకు అవగాహన గ్రామసభ ఎలా నిర్వహిస్తారని చింతూరు బీసీ కాలనీలో రెండో రోజు మంగళవారం జరిగిన పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ గ్రామసభలో తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు ఇల్లా చిన్నరెడ్డి అధికారులను ప్రశ్నించారు. మీకే అవగాహన లేనప్పుడు ముంపు ప్రజలకు ఎలా అవగాహన కల్పిస్తారని నిలదీశారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడు ఒక కుటుంబం అని, ప్రతి కుటుంబానికి ఆర్‌ అండ్‌ ఆర్‌ 2013 చట్ట ప్రకారంగా అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అధికారులు కేవలం వాలంటీర్లపై నెట్టివేసి ప్రజలకు అవగాహన కల్పించడం లేదనడం అర్థరహితమన్నారు. ఇంటి విలువ ఆర్‌ అండ్‌ ఆర్‌ సంబంధించి ఆర్‌ అండ్‌ బి శాఖ వారు సర్వే చేసి విలువ కడతారని, అది ఎంతో కూడా తమకు తెలియదని ఆర్‌ అండ్‌ ఆర్‌కు సంబంధించిన అధికారులు సభలో విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో సురేష్‌ బాబు. తహశీల్దారు కృష్ణ, ఎంపీపీ అమల, వైస్‌ ఎంపీపీ సుధాకర్‌, ఎస్‌ఐ శ్రీనివాసరావు, పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్‌ పాల్గొన్నారు.