Feb 24,2023 00:49
ట్రేస్‌ చేసిన 13 మొబైల్‌ ఫోన్‌లను బాధితులకు అందజేసిన ఎస్‌పి వకుల్‌ జిందాల్‌

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకున్న బాధితులు మీరు ఉన్న చోటు నుంచే 8978777833 వాట్సాప్‌ నెంబర్‌కు ఫిర్యాదు చేసుకోవచ్చునని జిల్లా ఎస్పి వకుల్‌ జిందాల్‌ తెలిపారు. గురువారం బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంప్‌ కార్యాలయ సమావేశ హాలులో బాపట్ల పట్టణ పోలీసు అధికారులు ఐటి కోర్‌ సిబ్బంది సహకారంతో ట్రేస్‌ చేసిన 13 మొబైల్‌ ఫోన్‌లను బాధితులకు జిల్లా ఎస్పి అందజేశారు. బాపట్ల జిల్లా ఏర్పాటు జరిగిన తరువాత, అన్ని పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో మొబైల్‌ ఫోన్‌లు పోయినట్లు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో జిల్లా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిచేందుకు పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌లను ట్రేస్‌ చేయడానికి జిల్లాలోని ఐటి కోర్‌ సిబ్బందితో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి, ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మొబైల్‌ ఫోన్‌ పోగోట్టుకున్న బాధితుల కోసం ప్రత్యేక సర్వీస్‌ పిటిషన్‌లు అందుబాటులో ఉంచారు. ఇంకా వేగంగా బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు రాకుండా వారు ఉన్న చోటు నుంచి ఫిర్యాదు చేసే విధంగా 8978777833 అనే వాట్సాప్‌ సర్వీస్‌ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. జిల్లా ఎస్పీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రయాణ సమయంలో, రద్దీగా ఉండే ప్రదేశాల్లో, బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లో, తిరునాళ్లు మరియు సినిమాహాలు వంటి ప్రదేశాలలో తమ మొబైల్‌ ఫోన్లను, విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకోవడం వల్ల కేవలం ఆస్తి నష్టమే కాకుండా దానిలో ఉన్న విలువైన సమాచారం కూడా పోయే ప్రమాదం ఉందన్నారు. కొన్ని సందర్భాల్లో సైబర్‌ నేరాలు జరిగే అవకాశం కూడా ఉందన్నారు. కాబట్టి ప్రజలందరూ విజ్ఞులై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మొబైల్‌ ఫోన్‌ పోయిన వెంటనే 8978777833 వాట్సాప్‌ నెంబర్‌కు హారు అని మెసేజ్‌ చేసి దానిలో వచ్చిన ఫారంలో మీ మొబైల్‌కు సంబంధించిన వివరాలు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్‌ ఎస్పి పి మహేష్‌ , బాపట్ల పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ పి కృష్ణయ్య, బాపట్ల పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ రఫీ పాల్గొన్నారు.