Nov 08,2023 14:29

న్యూఢిల్లీ :   మణిపూర్‌లోని కుకీ కమ్యూనిటీకి చెందిన ఐదుగురు సభ్యులను కిడ్నాప్‌కు గురైనట్లు అధికారులు బుధవారం తెలిపారు. కుకీల ఆధిపత్యం అధికంగా ఉండే కాంగ్‌పోక్సీ మరియు మైతేయిల ఆధిపత్యం అధికంగా ఉండే ఇంఫాల్‌ పశ్చిమజిల్లా సరిహద్దుల్లో ఉన్న కాంగ్‌చుప్‌ చింఖోంగ్‌కు సమీపంలో మంగళవారం ఉదయం 8.45 గంటలకు సాయుధ దుండగులు వారిని కిడ్నాప్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిలో నలుగురు సైనికుని కుటుంబసభ్యులుగా గుర్తించారు.

కాంగ్‌చుప్‌ చింఖోంగ్‌ గ్రామంలోని చెక్‌పోస్ట్‌ వద్ద బొలెరోను ఆపామని, కారులో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. వెంటనే కిడ్నాపర్లపై కాల్పులు చేపట్టామని అయితే ఒకరిని మాత్రమే రక్షించగలిగినట్లు పేర్కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా తొమ్మిది మందికి గాయాలయ్యాయి. కిడ్నాపర్ల చెర నుండి రక్షించిన మంగ్లున్‌హోకిప్‌ (65)కి కూడా తీవ్రగాయాలయ్యాయని.. అతనిని లిమాఖోంగ్‌లోని సైనిక ఆస్పత్రిలో చేర్చిటనట్లు వెల్లడించారు. ఇతరుల ఆచూకీ లభించలేదని అన్నారు. అయితే హోకిప్‌ చనిపోయినట్లు భావించిన దుండగులు విడిచిపెట్టి పారిపోయారని అన్నారు.

కిడ్నాప్‌ అయిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారని కుకీ కమ్యూనిటీ తెలిపింది. వారిని విడింపించేందుకు అవసరమైన సహాయకచర్యలు చేపట్టాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. కిడ్నాప్‌ గురైన వ్యక్తుల గురించి భయపడుతున్నామని ఆందోళన వ్యక్తం చేసింది.