Jul 23,2021 18:02

హైదరాబాద్‌ : తెలంగాణాలో బోనాల పండుగ సందర్భంగా సింగర్‌ మంగ్లీ ఆలపించిన పాటలోని లిరిక్స్‌ దేవతలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ పెద్ద రచ్చ జరుగుతోంది. దీనికి మంగ్లీ కూడా క్లారిటీ ఇచ్చారు. 'చెట్టుకింద కూసున్నవమ్మ చుట్టం లెక్క ఓ మైసమ్మ' పాటలో మోతువరి పదాన్ని కొంత మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, మోతువరి అంటే గ్రామ పెద్ద అని తెలిపారు. అయినప్పటికీ కొంత మంది పని గట్టుకుని మంగ్లీపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగ్లీపై బిజెపి నేత రాచకొండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మైసమ్మను కించపరిచేలా పదజాలం ఉందని పేర్కొన్నారు. దీంతో మంగ్లీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్‌ కూడా నడుపుతున్నారు. ఈ చర్యను దళితులు, బహుజన వర్గాలు ఖండిస్తూ... మంగ్లీకి మద్దతు నిలిచారు. బహుజన నేత సంగిశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ... ఈ చర్య మనువాదీ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ ఆలోచనతో ఉన్న వారు బహుజన సమాజం నుండి వినిపిస్తున్న స్వరాన్ని అణచివేయాలని చూస్తున్నారని, ఏదీ చేసినా ఉన్నత సామాజిక వర్గం వారే చేయాలని భావిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన అన్నమయ్య, మంజునాథ వంటి సినిమాల్లో కూడా దేవుళ్లను కించపరిచే విధంగా పాటలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రముఖ రచయిత తణికెళ్ల భరణి శివుణ్ని 'రారా శివ' అనే పదజాలాన్ని ఓ పాటలో వినియోగించారని చెప్పారు. అవేమీ విమర్శలకు దారి తీయలేదని అన్నారు. ఆమె ఎలా పాడాలి, ఎలా నాట్యం చేయాలని చెప్పేందుకు కిరణ్మయి (మంగ్లీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్‌ నడుపుతూ... స్వయం ప్రకటిత కార్యకర్త్తగా ప్రకటించుకున్నారు) ఎవరు అంటూ ప్రశ్నించారు. రచయిత పాసునూరి రవీందర్‌ మాట్లాడుతూ... శ్రీ రామదాసు సినిమాలో భక్త రామదాసు ఆలపించే పాటలో 'ఎవడబ్బా సొమ్మని కులుకుతు తిరిగేవు రామచంద్రా' అనే లిరిక్‌ కూడా ఉందని, దీన్ని పరిశీలించాలని వ్యాఖ్యానించారు. ఇలా అనేక మంది రచయితలు.. పలు సినిమాల్లో ఇటువంటి పదజాలాలు వాడారని... అప్పుడు వారిపై కేసులెందుకు పెట్టలేదని ప్రశ్నించారు.