ఎంపి సుజనా చొరవతో నిధులు మంజూరు
కొండమార్గంలో తాత్కాలిక మట్టి రోడ్డు నిర్మాణం
ఆనందం వ్యక్తం చేస్తున్న గిరిజనులు
పక్కారోడ్డుగా పటిష్టం చేయాలని వేడుకోలు
ప్రజాశక్తి-మాడుగుల : నేల కనబడనంతగా తుప్పలు, చెట్లతో నిండిన దట్టమైన అటవీ ప్రాంతం, నిండా భారీ బండరాళ్లు, విష సర్పాలు,అడవి జంతువులు సంచరించే ప్రాంతం, వాటి మధ్యలో సన్నని కాలిబాట.. ఇదే కొద్దిరోజులక్రితం వరకు అనేక గ్రామాల గిరిజనానికి రాకపోకలకు మార్గం. నిత్యవసరమైనా, అత్యవసరమైనా, లేదంటే పండించిన పంటలు అమ్ముకోవాలన్నా, ఇంటికి సరుకులు తెచ్చుకోవాలన్నా ఏళ్లతరబడి మన్యవాసులు ఇదే మార్గంలో వెళ్లిరావాల్సిందే. తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని వీరి గోడు ఇన్నాళ్లు అరణ్యరోదనగానే మిగిలిపోగా, స్థానిక ప్రజాప్రతినిధులలెవరికీ పట్టకపోయినా, సోషల్‌మీడియాలో వైరల్ అయిన కథనాలతో రాజ్యసభ సభ్యుడు సృజనాచౌదరి స్పందించి, నిధులు మంజూరు చేయడంతో ఇపుడు ఒక మట్టిరోడ్డు నిర్మాణం పూర్తయింది. దీంతో బ్రహ్మాండాన్నే సాధించినంతగా సంబరపడిపోతున్న గిరిజనులు, మట్టిరోడ్డును తారుతో పటిష్టం చేసి తమ కష్లాలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
మాడుగుల నుండి దేవపురం అటవీ ప్రాంతంలో 15 గిరిజన గ్రామాలకు ఎట్టకేలకు ఒక మట్టిరోడ్డు నిర్మితమైంది. బండరాళ్లు, తుప్పలతో నిండిన ఎగుడుదిగుడు కొండమార్గంలో ఇన్నాళ్లు రాకపోకలు సాగించిన మారుమూల గిరిజనులకు ఇపుడు రోడ్డు నిర్మాణంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము పండించిన పంటలను , సేకరించిన అటవీ ఉత్పత్తులు తలపైనో లేకుంటే భుజాన్నో మోస్తూ కాలినడకన మాడుగులకు విక్రయించేందుకు వచ్చేవారు. ఒక పర్యాయం ప్రసవ వేదనతో బాధపడుతున్న గిరిజన గర్బిణిని డోలిలో ఇదే మార్గంలో మోసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లిన దృశ్యాలను ఎవరో సెలఫోన్‌లో రికార్డుచేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.అదికాస్తా వైరల్ కావడంతో ఇక్కడి నేతలకు అదేమీ పట్టకపోయినా, రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి స్పందించి నిధులు మంజూరు చేయడంతో రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి, భారీ బండరాళ్లను తొలగించి, కొండఅంచుల్లో రోడ్డుకు రూపాన్ని ఏర్పాటు చేసి, దాన్ని కంకరతో పటిష్టం చేయడంతో ప్రస్తుతం సైకిళ్లు, బైక్‌లు, ఆటోలు రాకపోకలకు వీలుగాతయారైంది. ఉబ్బలింగ స్వామి దేవాలయం వద్ద నుండి దేవపురం వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల మార్గాన్ని పూర్తిగా చదును చేసి రోడ్డుగా మార్చారు .దేవపురం పరిసర గ్రామాల ప్రజలు తమ ఉత్పత్తులను మాడుగుల తీసుకెళ్లడానికి ఇదే దగ్గర దారి .పాడేరు ఘాట్ రోడ్డు మార్గంలో 12వ మైలురాయి, వంటలమామిడి మీదుగా రహదారి మార్గంలో మాడుగుల చేరుకునేందుకు అవకాశం ఉన్నప్పటికి, చుట్టూ తిరిగి రావడానికి బహుదూరం కావడంతో కష్టమైనా కాలినడకనే మాడుగుల వచ్చేందుకు గిరిజనులు ఆసక్తి చూపేవారు. అత్యంత క్లిష్టం, కష్టమైనా ఇదే మార్గంలో వచ్చే గిరిజనులకు ప్రస్తుతం నిర్మితమైన రోడ్డుతో కొంతమేర కష్టాలు తీరనున్నాయి. తాత్కాలికంగా ఏర్పాటైన మట్టిరోడ్డును పటిష్టం చేయాలని మన్యవాసులు కోరుతున్నారు. అదే పూర్తయితే గిరిజనం రాకపోకల కష్టాలు తీరడంతోపాటు మాడుగుల సంత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.










