Oct 29,2023 22:55

పూర్ణపాడు-లాబేసు వంతెన పూర్తికాకపోవడంతో నాగావళి నదిలో నుంచి వెదురు బొంగులతో చికిత్స కోసం చిన్నారి తరలిస్తున్న గిరిజనులు (ఫైల్‌)

విజయనగరం ప్రతినిధి: పార్వతీపురం మన్యం జిల్లాపై అడుగడుగునా పాలకుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. పేరుకు ప్రత్యేక జిల్లా అయినప్పటికీ వారి సామాజిక భద్రత మొదలుకుని, ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం అన్నింటికీ దూరంగానే ఉన్నారు. చివరికి ఏనుగుల దాడులు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో గిరిజనులతోపాటు మైదాన ప్రాంత వాసులు సైతం భయం గుప్పెట్లో బతుకీడుస్తున్నారు. జిల్లాలో తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో రైతాంగం తల్లడిల్లుతోంది. విద్య, వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రపంచం ఓ కుగ్రామంలా మారినప్పటికీ గిరిశిఖర గ్రామాల్లో ఇంకా డోలి మోతలు తప్పడం లేదు. ముఖ్యంగా సిఎం జగన్మోహన్‌రెడ్డి హామీలు నీటిమూట లుగానే మిగిలాయి. అంతకు ముందున్న టిడిపి ప్రభుత్వంలోనూ అభివృద్ధిలో ఏమంత దూసుకుపోలేదు. ఈనేపథ్యంలో ప్రజల కష్టనష్టాలు తెలుసుకుని, ప్రభుత్వాలను ఎండగట్టేందుకు సిపిఎం ఆధ్వర్యాన ఈనెల 30 నుంచి నవంబర్‌ ఒకటో తేదీ వరకు పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజారక్షణ భేరి పేరిట బస్సు యాత్ర సాగనుంది.
మన్యం జిల్లాలో తోటపల్లి, జంఝావతి సాగునీటి ప్రాజ్టెలను పూర్తిచేస్తామని సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు నిర్వహించిన పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఆచరణలో తోటపల్లికి తగినంతగా నిధులు కేటాయించలేదు. జంఝావతి పూర్తికి ఒడిశాతో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు రాజకీయంగా చిత్తశుద్ధి కనబర్చలేదు. అంతకు ముందు అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం కూడా నిధులు అంతంత మాత్రంగానే కేటాయించింది. దీంతో ఈ రెండు సాగునీటి ప్రాజెక్టులూ లక్ష్యానికి అనుగుణంగా సాగునీరు అందించడం లేదు. ఏజెన్సీలోని జీవగెడ్డలపై మినీ రిజర్వాయర్లు, చెక్‌డ్యాములు నిర్మించడం ద్వారా సాగునీటి వనరులను పెంచాలని స్థానికులు దశాబ్దాల తరబడి కోరుతున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదు. అటు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మోటార్‌ వాహన చట్టాల వల్ల సాలూరు లారీ పరిశ్రమ కుదేలైంది. దీనికి తోడు ట్యాక్సులు, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు జీవనోపాధిని దెబ్బతీశాయి. విద్యుత్‌ ఛార్జీల పెంపు, ప్రభుత్వ విధానాల కారణాల జీగిరాం జ్యూట్‌ మిల్లు అనేక ఒడిదొడు కులు ఎదుర్కొంటోంది. 1983లో 2వేల మందికి ఉపాధి కల్పించే ఈ మిల్లులో ప్రస్తుతం 1200 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇది కూడా 17 నెలలుగా మూతపడటంతో ఉపాధి లేక విలవిల్లాడుతున్నారు.
ఒడిశా ప్రాంతం లకేరి అడవుల నుంచి వచ్చిన అడవి ఏనుగుల గుంపు 16 ఏళ్లుగా మన్యం వాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే ఏనుగుల దాడిలో 17 మంది మృతిచెందారు. వేలాది ఎకరాల్లో పంటలను నాశనం చేశాయి. ఈ నేపథ్యంలో ఏనుగుల నుంచి రక్షణ కల్పించాలని జిల్లా వాసులు గగ్గోలు పెడుతున్నా అతీగతీ లేకుండా పోయింది. చాలా గిరిజన గ్రామాలు నాన్‌ షెడ్యూల్డ్‌ ఏరియాగా గుర్తించక పోవడంతో అక్కడి గిరిజనులు ప్రభుత్వ రాయితీలు, పథకాలు పొందలేకపోతున్నారు. గిరిజన చట్టాలు సరిగా అమలు కావడం లేదనే ఆందోళనలో గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. జంఝావతి సాగునీటి ప్రాజెక్టు పూర్తికి ఒడిశా రాష్ట్రంతో నెలకొన్న చిన్నపాటి వివాదం నాలుగు దశాబ్దాల తరబడి కొనసాగుతోంది. దీన్ని పరిష్కరించే పేరుతో శ్రీకాకుళంలోని ఓ పార్టీ నేత పెళ్లికి వెళ్లిన సిఎం జగన్‌ పనిలో పనిగా భువనేశ్వర్‌ వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర అధికారులతో చర్చించారు. ఇది జరిగి సుమారు మూడేళ్లు కావస్తున్నా, తరువాత పట్టించుకోలేదు.
పాచిపెంట మండలం కుడుమూరు రెవెన్యూ పరిధిలోని గిరిజనులు సాగుచేసుకుంటున్న 782 ఎకరాలకు పట్టాలిచ్చేందుకు పాలకులు, అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. మరోవైపు ఈ భూములన్నీ తమవేనంటూ కొంతమంది పెత్తందారులు కైవశం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరికి పాలకులు వత్తాసు పలకడంతో సిపిఎం ఆధ్వర్యాన ప్రతిఘటించడంతో ప్రస్తుతానికి వెనక్కి తగ్గారు. మద్దతు ధర కల్పించాలంటూ జిల్లాలోని వేలాది మంది జీడి రైతులు ఇటీవల ఆందోళనలు నిర్వహించినా ప్రభుత్వానికి పట్టడం లేదు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు అనారోగ్యం వాటిల్లితే స్థానికంగా వైద్యం అందించే ఎఎన్‌ఎంలు లేక విద్యార్థులు బయటకు వెళ్లాల్సి వస్తుంది. నేటికీ డోలీ మోత తప్పడం లేదు. సీతంపేట, పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో 176 సవరభాష పాఠశాలలు ఉన్నాయి. వారి సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణమైన భాష ద్వారానే విద్యాబోధన చేయాలని ఏళ్ల తరబడి కోరుతున్నా పట్టించుకోలేదు. గుమ్మలక్ష్మీపురంలో డైట్‌ కళాశాల ఏర్పాటుకు ఐటిడిఎ అధికారులు చర్యలు చేపట్టినా పనులు మాత్రం ప్రారంభించలేదు. కొమరాడ మండలం పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో, సుమారు 20 గ్రామాల ప్రజానీకం మండల కేంద్రానికి రావాలంటే సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం మేర ప్రయాణం చేయాల్సిన దుస్థితి కొనసాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రాణాపాయంలో ఉన్న రోగులను సైతం నాటుపడవలో ప్రయాణించాల్సిన దుస్థితి దాపురిస్తోంది. టిడిపి ప్రభుత్వ హయాంలో ఈ వంతెను ఎప్పటికి పూర్తిచేస్తారంటూ జిల్లా పరిషత్‌ సమావేశాల్లో వీరంగం సృష్టించి, సభను స్తంభింపజేసిన కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి కనీసం పట్టించుకోవడం లేదని కొమరాడ మండల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా మన్యం జిల్లాలో ఎన్నో సమస్యలు, మరెన్నో అమలు కాని హామీలు ఉన్నాయి.
నేడు కురుపాం, పార్వతీపురాల్లో బహిరంగ సభలు
సీతంపేటలో ప్రారంభం
సిపిఎం నేతలు రాఘవులు, శ్రీనివాసరావు రాక
ప్రజారక్షణ భేరి పేరిట సిపిఎం ఆధ్వర్యాన తలపెట్టిన బస్సు యాత్ర సీతంపేట ఐటిడిఎ కేంద్రం నుంచి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. 30, 31వ తేదీ వరకు మన్యం జిల్లాలోనూ, 1వ తేదీన విజయనగరం జిల్లాలో యాత్ర సాగుతుంది. యాత్రకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నాయకత్వం వహించనున్నారు. తొలిరోజు కురుపాం, పార్వతీపురం కేంద్రాల్లో బహిరంగ సభలు జరుగుతాయి. సభలకు ముఖ్యఅతిథిగా సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులు హాజరు కానున్నారు. యాత్రలో సిపిఎం రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారు. 30న సీతంపేట నుంచి పాలకొండ మీదుగా కురుపాం చేరుతుంది. మధ్యాహ్నం 1 గంటకు బహిరంగ సభ జరుగుతుంది. అనంతరం సాయంత్రం ఆరు గంటలకు పార్వతీపురం పట్టణంలో బహిరంగ సభ జరుగుతుంది. యాత్ర బృందం రాత్రికి అక్కడే బసచేస్తుంది. 31వ తేదీ ఉదయం 9 గంటలకు సీతానగరం, 12 గంటలకు సాలూరు చేరుతుంది. సాలూరు పట్టణంలో బహిరంగ సభ అనంతరం సాయంత్రం 6 గంటలకు విజయనగరం జిల్లా మెంటాడకు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తుంది.