May 30,2023 00:11

అరకులోయలో ఆందోళన చేపడుతున్న యానిమేటర్లు

ప్రజాశక్తి-డుంబ్రిగూడ:యానిమేటర్లకు మూడు సంవత్సరాల కాల పరిమితిని రద్దు చేయాలని, బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షుడు భాస్కర్‌ మాట్లాడుతూ, మూడేళ్ల కాల పరిమితికి సంబంధించి ప్రభుత్వ సర్క్యులర్‌ తీసుకురావడంతో అనేకమంది ఉపాధి కోల్పోతారని చెప్పారు. యానిమేటర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు కే.బుచ్చిబాబు, జాన్‌, యానిమేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ముంచింగిపుట్టు:మండలంలో వెలుగు వివోఒ యానిమేటర్లు సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం సమ్మెను నిర్వహించారు. ఈ సందర్భంగా వివోఏ సంఘం అధ్యక్షురాలు జ్యోతి మాట్లాడుతూ, మూడు సంవత్సరాల కాల పరిమితి సర్కిలర్‌ రద్దు చేసి, వివో ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేసి, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలన్నారు. బకాయి పడ్డ వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లోకో యాప్‌ పనుల నిమిత్తం ఫైవ్‌ జి మొబైల్‌ను ప్రభుత్వమే ఇవ్వాలని, వయోపరిమితి, చదువు ఉత్తీర్ణత పేర్లతో వివోఏల తొలగింపులు ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజారావు, రామలక్ష్మి, గౌతం పాల్గొన్నారు.
హుకుంపేట: మండలంలోని విఓఎలు వెలుగు కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించి, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని విఎఎలు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో విఓఏ లు పాల్గొన్నారు.
అరకులోయ రూరల్‌:రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఐకెపి కార్యాలయం ముందు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి వివోఏ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్బి రాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వివోఏల పట్ల చిన్నచూపు చూస్తుందన్నారు.వివోఏలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో ఆనంద్‌, చిన్న, పార్వతి, దున్ను, తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి:వివోఏల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని స్థానిక జెడ్పిటిసి దీసరి .గంగరాజు తెలిపారు. స్థానిక వెలుగు కార్యాలయం వద్ద వివోఏల నిరసనలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పొదుపు సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్న వివోఏ లను తొలగిం చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు.ఐటీడీఏ పాలకవర్గం, జిల్లా పరిషత్‌ సమావేశంలో ప్రస్తావించి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామి ఇచ్చారు. టోకురు సిపిఎం సర్పంచ్‌ కిలో. మొస్య, సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌. నాగులు, గిరిజన సంఘం మండల కార్యదర్శి జె .సుబ్బరావులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివోఓల యూనియన్‌ నాయకులు ఎం. రంజిత, కె. దిలీప్‌, శిరీష తదితరులు పాల్గొన్నారు.