Jul 27,2023 00:18

పొంగిప్రవహిస్తున్న మర్దగుడ, లక్ష్మీపురం గెడ్డ

ప్రజాశక్తి-పాడేరు:అల్లూరి జిల్లా పాడేరు, రంపచోడవరం డివిజన్లోని ఏజెన్సీ మండలాలలో గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే అధికంగా నమోదవుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కొన్నిచోట్ల కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి.పాడేరు ఏజెన్సీలో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి, ఈనెల 24న సోమవారం జిల్లా వ్యాప్తంగా 428.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా ఒక్క చింతూరు మండలంలోనే అత్యధికంగా 146.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఈనెల 25న మంగళవారం జిల్లా వ్యాప్తంగా 316.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అల్లూరి జిల్లాకు ఒక చివరనున్న అనంతగిరి మండలంలో 52 మిల్లీమీటర్లు, ఎటపాక మండలంలో 45.6 మిల్లీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదయింది. జిల్లా వ్యాప్తంగా వాన జోరు పెరుగుతుండడంతో ఈనెల 26న అన్ని మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదయింది. రంపచోడవరం డివిజన్లో సోమవారం నుంచి వాన ఉధృతి పెరిగింది.
గిరిజనుడు మృతి, నాలుగు ఎద్దులు మృత్యువాత
అరకులోయ రూరల్‌: మెరుపులతో కూడిన భారీ వర్షానికి పిడుగుపాటుకు గిరిజనుడుతో పాటు, నాలుగు దుక్కెటి ఎద్దులు మృతి చెందిన సంఘటన మండలంలోని చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని మాదల పంచాయతీ బోరిగుడ గ్రామానికి చెందిన గుబ్బాయి రాజు (50), బుదవారం పశువులను మేత కోసం గ్రామ సమీపంలో కొండపై తీసుకెళ్ళాడు. భారీ మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో పశువులు మేపు తుండగా పిడుగుపాటుకు గురై రాజుతో పాటు నాలుగు దుక్కెటి ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో ఇద్దరు కొంత దూరంలో ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు, కుటుంబ సభ్యులు రాజు మృతిపై కన్నీరు మున్నీరుగా విలపించారు.
అనంతగిరి:మండలంలోని గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గెడ్డలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. శివలింగపురం, టైడా, డమ్ముకు, అనంతగిరి, బీసుపురం, సుంకరమెట్ట ప్రధాన రోడ్డులో వరద నీరు చేరింది. దీంతో, రాకపోకల ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు.వాహన చోదకులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వాహనాలు నడపాల్సిన పరిస్థితి నెలకొంది.డముకు, కాశీపట్నం వారపు సంతలకు వచ్చిన వారంతా ఇబ్బందులు పడ్డారు. ఎగువ శోభ పంచాయతీ మర్దగుడగెడ్డ పొంగడంతో వరద తగు ముఖం పట్టేంత వరకు గిరిజనులు నిలిచి పోయారు.
డుంబ్రిగుడ:మండలంలో బుధవారం సాయంత్రం కొండపోత భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వర్షం కురిసినప్పటికీ మధ్యాహ్నం మూడు గంటలకు నుంచి భారీగా కుండపోత వర్షం ఏకధాటిగా కురవడంతో మండల కేంద్రంలోని వీధి కాలువలు, రోడ్లన్నీ పూర్తిగా వర్షపు నీటితో నిండాయి. వీధి కాలువల్లో చెత్తచెదారం పేరుకు పోయి ఉండటంతో వర్షపు నీరు వెళ్లడానికి దారి లేక కాలువల్లోనే వర్షపు నీరు నిల్వ ఉండిపోతుంది. చాపరాయి, గోరాపురం గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి.