Jul 23,2023 00:04

ముంచంగిపుట్టులో ఆందోళన చేపడుతున్న నాయకులు

ప్రజాశక్తి-యంత్రాంగం
మణిపూర్‌ అల్లర్లలో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగింపు నిర్వహించిన ఘటనను ఖండిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎపి ఆదివాసీ గిరిజన సంఘం, గిరిజన మహిళా సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన నిరసనలు మిన్నంటాయి. అరకువేలీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి మెయిన్‌ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి, రాస్తారోకో చేపట్టారు. హుకుంపేట, ముంచంగిపుట్టు, పెదబయలు మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. డుంబ్రిగుడ మండలం సాగర పంచాయతీ అడపవలసలో గిరిజనులు ఆందోళన చేపట్టారు.
అరకులోయ రూరల్‌:మణిపూర్‌ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఆదివాసులపై హింసకాండ, అత్యాచారాలకు పాల్పడుతుందని ప్రజా సంఘాల నేతలు విమర్శించారు. అరకువేలి డిగ్రీ కళాశాల నుండి అరకువేలి మెయిన్‌ రోడ్డు వరకు ఆదివాసి గిరిజన సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన మహిళ సంఘం ఆధ్వర్యాన శనివారం ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌ మాట్లాడుతూ, మణిపూర్‌ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం హింసకాండ వెనుక మైనింగ్‌ మాఫియా ఉందని, అడవి ప్రాంతంలో తవ్వకాలు చేపట్టేందుకు కుట్ర పూరితంగా దాడులు, అత్యాచారాలకు ఒడిగడుతుందని దుయ్యబట్టారు.ఐద్వా మహిళ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షురాలు వివి జయ మాట్లాడుతూ, మణిపూర్‌ సంఘటనపై వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతుంటే ఇంటర్నేట్‌ సిగల్‌ ఆపివేసి హింసను ప్రోత్సహించడం బిజెపి ప్రభుత్వం దుర్మార్గానికి నిదర్శనమన్నారు. గిరిజన మహిళ సంఘం మండల నాయకురాలు జి సన్యాసమ్మ, అరకువేలి ఎస్‌ఎఫ్‌ఐ గర్ల్స్‌ కన్వీనర్‌ కె ధనలక్ష్మి, ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షులు పి.కృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి ఎస్‌.ఐసుబాబు, మండల ఉపాధ్యక్షులు కె.శాంతి, కె.బలరాం, మండల కమిటీ సభ్యులు కార్తీక్‌, సింగ్‌, ఆదివాసి గిరిజన సంఘ మండల కార్యదర్శి పి రామన్న, నాయకులు కె.మగ్గన్న, పి.రామ్‌ విద్యార్థులు పాల్గొన్నారు.
హుకుంపేట: బిజెపి ఉన్నంత కాలం మహిళలకు రక్షణ ఉండదని ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షుడు తాపూల క్రిష్ణారావు తెలిపారు.మణిపూర్‌ లో గిరిజనులపై బీజేపీ హింసాకు నిరసనగా స్థానిక పెట్రోల్‌ బ్యాంక్‌ నుంచి మూడు రోడ్ల కూడలి వరకు కాలేజి విద్యార్థులతో గిరిజన మహిళ సంఘం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. గిరిజన మహిళ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌.హైమావతి, సీపీఎం మండల కార్యదర్శి వి.లక్ష్మణ్‌రావు, గిరిజన సంఘం ఉప అధ్యక్షులు రామారావు పాల్గొన్నారు.
ముంచంగిపుట్టు:ఆదివాసీ గిరిజన సంఘం, ఆదివాసీ మహిళా సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని గిరిజన సంఘం కార్యాలయం నుండి నాలుగు రోడ్ల కూడలి వద్దకు భారి ర్యాలీ నిర్వహించారు.ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి కె.నర్సయ్య, అధ్యక్షుడు ఎంఎం శ్రీను, మహిళా సంఘం(ఐద్వా) మండల అధ్యక్షులు ఈశ్వరి మాట్లాడుతూ, మతం పేరుతో మారణ హౌమం సృష్టించడం బిజెపికి తగదన్నారు. వైస్‌ ఎంపీపీ సత్యనారాయణ, లక్ష్మీపురం సర్పంచ్‌ కె.త్రినాధ్‌, సీపీఎం మండల కార్యదర్శి పి.భీమరాజు, మహిళ సంఘం మండల కార్యదర్శి విజయ, రాధ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కె.దోంబ్రు, పి.వరహాలు, మోహన్‌, బాషా వాలంటీర్స్‌ సంఘం నాయకులు కొండయ్య, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.
పెదబయలు:మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సామూహిక అత్యాచారంకు పాల్పడిన వారిపై తక్షణమే క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని ఆదివాసీ గిరిజన సంఘం పూర్వపు అధ్యక్షులు బోండా సన్నిబాబు డిమాండ్‌ చేశారు.ఆదివాసీ గిరిజనసంఘం జిల్లా కమిటీ సభ్యులు కిల్లో శరబన్న, జె.సునీల్‌ కుమార్‌, సీతగుంట పంచాయతీ వైస్‌ ప్రెసిడెంట్‌ బొండా గంగాధర్‌, చెండా రామారావు, తదితరులు పాల్గొన్నారు
డుంబ్రిగుడ: సాగర పంచాయతీ అడపవలస గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు శనివారం ఆందోళన నిర్వహించారు. అనంతరం గిరిజన సంఘం అల్లూరి జిల్లా ఉపాధ్యక్షుడు టి సూర్యనారాయణ, సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎస్‌ బి పోతురాజు మాట్లాడుతూ, ఇద్దరు ఆదివాసీ మహిళలను నగంగా ఊరేగించడం చాలా దారుణమన్నారు. నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్‌, పాపారావు, వి.సురేషకుమార్‌, మంజుల, గోపాల్‌ చంద్ర పాల్గొన్నారు.
రాజవొమ్మంగి:మణిపూర్‌లో అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఎపి ఆదివాసీ గిరిజన సంఘం, యుటిఎఫ్‌, సిఐటియు, చేతివృత్తులు, వర్తక, వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో 99 క్వాటర్స్‌ నుండి స్థానిక అల్లూరి జంక్షన్‌ వరకు మహిళలు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అల్లూరి జంక్షన్‌ వద్ద కొవ్వొత్తులతో మానవహారం చేపట్టారు. ఆయా సంఘాల నాయకులు లోతా రామారావు, రమేష్‌, పైడిమల్లు, వెంకటలక్మి, రమణి, రామరాజు, కె.వెంకటలక్మి, ఆలీ, టి.శ్రీను మాట్లాడుతూ, రాజవొమ్మంగి సర్పంచ్‌ జి రమణి, లబ్బర్తి ఎంపిటిసి జి పెద్దిరాజు, ఆయా సంఘాల నాయకులు గుప్తా, కిరణ, బుజ్జి పాల్గొన్నారు.
సీలేరు : మణిపూర్‌లో శాంతిభద్రతలను నెలకొల్పడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందాయని భారతీయ ఆదివాసీల సమైక్య ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు గడుతూరు రాంగోపాల్‌ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ, మెజార్టీ మెయితీలు గిరిజన తెగలపై దాడులు చేస్తున్నారని తెలిపారు.