Nov 16,2022 23:52

లైట్ల వెలుగులో వెళుతున్న వాహనదారులు

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: అల్లూరి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత అధికమైంది. ఉదయం 9 గంటల వరకు పాడేరు, చింతపల్లి, అరకులోయ ప్రాంతాలలో పొగ మంచు దట్టంగా కురుస్తోంది. 10 గంటల వరకు భానుడు కనిపించ లేదు. పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డు వద్ద 10డిగ్రీలు, జిల్లా కేంద్రం పాడేరులో 12, చింతపల్లిలో 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నెలకొంది. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు క్రమేపి మరింత తగ్గే పరిస్థితులు నెలకొన్నాయి. పొగ మంచు అధికంగా ఉండటంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్ని దుస్తుల వినియోగం పెరిగింది. వాహన చోదకులు లైట్లు వేసుకునే వాహనాలు నడుపుతున్నారు. వ్యవసాయ పనులు, వారపు సంతలకు వెళ్లే గిరిజనులు పొగ మంచుతో ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాలతో పాటు గిరిజన గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఏజెన్సీని సందర్శిస్తున్న పర్యాటకులను పొగ మంచు అందాలు ఆకర్షిస్తున్నప్పటికీ చలిపులితో వణుకుతునే అహ్లాదకర వాతావరణంలో సందడి చేస్తున్నారు.