ప్రజాశక్తి-పాడేరుటౌన్:ఏజెన్సీ అంతటా ప్రస్తుతం ఇటుకుల పండుగతో సందడి వాతావరం నెలకొంది. గిరిజనులు సంప్రదాయ థింసా నృత్యాలు, డప్పుల మోతలు, రకరకాల ఆటపాటలతో ఉల్లాసంగా గిరిజనులు గడుపుతున్నారు. మహిళలు రహదారులపై గేట్లను (తాడుతో) పెట్టి, వాహనదారులు, ప్రయాణికుల నుంచి పజోర్ ( తాచేరు పండుగ చందా ) వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వారిపై రంగు నీళ్లు చల్లి హడావుడి చేస్తున్నారు. ఏటా చైత్రమాసంలో జరిగే ఇటుకల పండుగ విశిష్టత, ప్రాశస్త్యం, విశేషాలపై ప్రత్యేక కథనం.....
మగవారు అడవిలోకి వేటకు...
ఏజెన్సీలోని గిరిజనులు ఇటుకలు పండుగను దాదాపు అన్ని గ్రామాల్లో చైత్ర మాసంలో ఏదో ఒక రోజు జరుపుకుంటారు. ఇటుకల పండుగ సమయంలో పురుషులు తమ వీరత్వాన్ని చూపాలి. లేకపోతే తమతో సమానమంటూ మహిళలు వారికి ఆటపట్టిస్తూ చీరలు కడతారు. వీరత్వాలు ఏమిటంటే.. గ్రామానికి చెందిన పురుషుల సమీపంలోని అడవిలోకి వేటకు వెళ్లి ఏదైనా జంతువును వేటాడి ఊర్లోకి రావాలి. లేకపోతే మహిళలు రానివ్వరు. ఇటువంటి వారిని ఆ గ్రామ పొలిమేర్లలో మహిళలు అడ్డుకుని జరిమానా వసూలు చేస్తారు. ఆ డబ్బులను ఇటుకల పండుగ కోసం ఖర్చు చేస్తారు. ఊరంతా సహపంక్తి భోజనాలు చేస్తారు. పండుగ రోజు సాయంత్రం మహిళలు దింసా నృత్యాలు చేస్తారు.
పజోర్ వసూలు
గ్రామాల్లో పజోర్ (తాచేరు పండుగ చందా) వసూలు కాస్తా ప్రధాన రహదారులపై తాళ్లతో గేట్లు పెట్టి వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. జాతీయ రహదారిపై టోల్ గేట్ల వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖుల వాహనాలకు ఫీజు మినహాయింపు ఉంటుంది. కానీ మన్యంలో ఇటుకల పండుగ సందర్భంగా గిరిజన మహిళలు ఏర్పాటు చేసే గేట్ల వద్ద ఎవరికి మినహాయింపు ఉండదు. ద్విచక్ర వాహనదారుల నుంచి లారీలు, బస్సుల వరకు ఎవరైనా సరే డబ్బులు ఇచ్చి కదలాలి. లేదంటే రంగు నీళ్లు చల్లుతారు.
పండుగ సంప్రదాయం
చైత్రమాసం తొలి రోజున గిరిజనులు తమ పొలాల్లో పండించిన ఆహార పంటల్లో నుంచి కొద్దిగా గింజలు తీసుకొని గ్రామ పొలిమేరలో ఉండే సంకుదేవుడి వద్ద పెట్టి కోడిని కోసి పూజలు చేసేవారు. రానున్న కాలంలో పంటలు బాగా పండాలని మొక్కుకుంటారు. పూజలో ఉంచి గింజలను భద్రపరచి వర్షాలు పడిన తర్వాత పంట పొలాల్లో చల్లుతారు. ఇదిలా ఉండగా ఇటుకల పండుగ సందర్భంగా బావమరుదల వరుస అయ్యేవాళ్ళు వేర్వేరు బృందంగా ఏర్పడి, వివిధ రకాల పోటీలు పెట్టుకుంటారు. బాణంతో కోడి గుడ్డును కొట్టడం, అడవిలోంచి తీసుకువచ్చిన తాడు లాంటి బడ్డును లాగడం వంటి ఆటలు ఆడతారు. బాణం గురి తప్పకుండా గుడ్డుకు తగిలితే వేటలో విజయం సాధిస్తామని వారి విశ్వాసం. అలాగే చిన్నపిల్లల కోసం గ్రామంలో ఊయ్యాలలు కడతారు.
పాత పాడేరులో కోలాహలం...
పాడేరు:పట్టణంలోని పాత పాడేరులో ఆదివారం సాయంత్రం ఇటుకల పండుగ కోలాహలంగా సాగింది. గ్రామంలోని మహిళలు దింసా నృత్యాలతో సందడి చేశారు. చిత్ర విచిత్ర వేషాలతో నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా ఆడి పాడి అలరించారు. బడ్డు ఉత్సవంలో అక్కా చెల్లెళ్ళు వదిన మరదళ్ల మధ్య బల ప్రదర్శన జరిగింది. ఈ బల ప్రదర్శన హౌరాహౌరీగా సాగింది. చివరికి అక్కాచెల్లెళ్లే విజయం సాధించారు. శనివారం పురుషుల మధ్య జరిగిన బల ప్రదర్శనలో వరుసకు అన్నదమ్ములు గెలవగా నేడు అక్కాచెల్లెళ్ల వరుస ఉన్న మహిళలు గెలవడం విశేషం.
ప్రత్యేక పూజలు చేస్తున్న మహిళలు
పురాతన ఆయుధాలకు పూజలు
పెదబయలురూరల్:మండలంలోని సీతగుంట, పెదబ యలులో ఇటుకల పండగ పురస్కరించుకొని గ్రామస్తులు ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు తుడుం, డప్పు వాయిద్యాలతో కనువిందు చేశారు.










