Dec 18,2022 23:36

సిఐటియు ఆధ్వర్యాన ఆందోళన చేపడుతున్న మహిళా కారిమకులు (ఫైల్‌ ఫొటో)

ప్రజాశక్తి-పాడేరు:గిరిజన ప్రాంతంలో సిఐటియు అనేక సమరశీల పోరాటాలు చేసింది. గిరిజన ప్రాంతంలో కార్మికులందరినీ ఐక్యం చేసి పోరాటాల గడ్డగా ఏజెన్సీకి సిఐటియు పేరు తీసుకొచ్చింది. రెండున్నర దశాబ్దాలుగా అలుపెరగని ఉద్యమాలు సాగించి కార్మికుల సమస్యలు, డిమాండ్లపై న్యాయ పరిష్కారానికి కృషి చేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 20, 21 తేదీలలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో సిఐటియు ప్రధమ మహాసభలు జరగ నున్నాయి. ఈ మేరకు మహాసభలు విజయవంతానికి ఏజెన్సీలో పలు మండలాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అన్ని రంగాల కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, అందరూ తరలి రావాలని ప్రచారం చేపడుతున్నారు. మహాసభల సందర్భంగా సిఐటియు మన్యంలో చేపట్టిన పోరాటాలు
- 2000 సంవత్సరంలో అరకు వ్యాలీ హెచ్‌ఎన్‌టిసి పద్మాపురం గార్డెన్‌ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సాగించిన పోరాటం సిఐటియుకి మంచి గుర్తింపునిచ్చింది. ఉద్యోగ భద్రత, కనీస వేతనం కోసం పోరాడుతున్న కార్మికులను ఐటిడిఏ పోలీసులతో ఉద్యమాన్ని అణిచివేసి కార్మికులను జైల్లో కూడా పెట్టారు. దీనికి వ్యతిరేకంగా సిఐటియు ఏజెన్సీ వ్యాప్తంగా కార్మికులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాడి విజయం సాధించింది.
-ఏజెన్సీలో క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు కేవలం నెలకు రూ.300ల జీతంతో పని చేసేవారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించి విజయం సాధించారు. పోరాట ఫలితంగా ప్రస్తుతం ఆశాలుగా ఉంటూ నెలకు పదివేల రూపాయలు అందుకుంటున్నారు.
- పాడేరు, చింతపల్లి, జికే వీధి, పెదబయలు, అరకు, అనంతగిరి మండలాల్లో కాఫీ కార్మికులు సమస్యలపై అనేక పోరాటాలు సిఐటియు నిర్వహించింది.కాఫీ పళ్ళు సేకరణ, కూలి రేట్లు పెంచాలని సీనియర్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని, అనేక దపాలుగా సమ్మెలు, ముట్టడి వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించింది.
-అరకు ఏపీ టూరిజంలో పని చేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం ఇవ్వాలని పెద్ద ఎత్తున 2010లో ఉద్యమించి సమ్మెకు దిగి టూరిజం కార్పొరేషన్‌ యాజమాన్యాన్ని అరకుకి రప్పించి సమస్యలు పరిష్కరించుకొని విజయం సాధించుకున్నారు.
-గిరిజన ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారు. ఫలితంగా జీతాలు పెంచుకొని కొంతమందిని రెగ్యులర్‌ అయ్యారు.
- 2016 సంవత్సరంలో చింతపల్లి హెచ్‌ఎంటిసి, అరకు, కొత్తవలస, పద్మాపురం గార్డెన్‌, గిరిజన మ్యూజియం కార్మికులు సమ్మె చేసి కలెక్టర్‌ గెజిట్‌ జీవో ప్రకారం వేతనాలు సాధించుకున్నారు. జిసిసి సోప్‌ యూనిట్లో పని చేస్తున్న కార్మికులు 40 రోజులు సమ్మె చేసి పీస్‌ రేటు ప్రకారం కూలి చెల్లిస్తున్న కార్మికులకు నెల జీతం సాధించుకున్నారు. పాడేరు, అరకులో పని చేస్తున్న ఏరియా ఆసుపత్రి పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచాలని పోరాట ఫలితంగా వేతనాలు పెంచుకొని విజయం సాధించుకున్నారు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు కరోనా సమయంలో ఆర్థికంగా ఆదుకోవాలని పెద్ద ఎత్తున సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యమించారు. అంగన్వాడి, ఆశ, వివో ఏలు, మిడ్‌ డే మీల్స్‌ కార్మికులపై ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల వేధింపులను ఆపాలని పెద్ద ఎత్తున సిఐటియు ఉద్యమించింది. అనేక రంగాల్లోని గిరిజన కార్మికుల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు చేసిన పోరాట పదంలో సిఐటియు సఫలీకృతం అయింది.