ప్రజాశక్తి-సీతంపేట : ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో ఏనుగులతో సతమతమవుతున్న ఆదివాసీలను మరో భయం పట్టుకుంది. బుధవారం దోనుబాయి సమీపంలో పెద్దపులి సంచరించింది. పుబ్బాడ, శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం బడిగం మీదుగా కొరమ వైపు పులి వెళ్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటికే దోనుబాయి గుగ్గిలం తోటలో పెద్దపులి అడుగు జాడలను పరిశీలించారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు.
భామిని : మండలంలోని కొరమ గ్రామ సమీపంలోని క్వారీ పరిసరాలలో పులి అడుగుజాడలు స్థానికులను కలవర పెడుతున్నాయి. స్థానిక క్వారీలో ఉండే వాచ్‌మెన్ బుధవారం తెల్లవారుజామున పులి సంచరించినట్లు కనిపించిందని, భయంతో పూర్తి స్థాయిలో ఆ జంతువును పరిశీలించలేదని తెలిపాడు. అటవీ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలించగా పులి అడుగుజాడలుగా తెలియజేశారు. వెంటనే సమాచారాన్ని తహశీల్దార్ ఎన్.అప్పారావుకు తెలియజేయడంతో కొరమ పరిసర గ్రామాలలో టామ్ టామ్ వేసి, ప్రజలను అప్రమత్తం చేశారు. క్వారీ పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.










