ప్రజాశక్తి - కురుపాం : కురుపాంతో పాటు ఏజెన్సీలోని అన్ని గ్రామాల్లో జ్వర తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా గ్రామాల్లో జ్వరపీడితులు ఎక్కువయ్యారు. ప్రతి ఇంటికి ఇద్దరు, ముగ్గురు జ్వరం బారిన పడుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా జ్వరాలు ఎక్కువ కావడం వల్ల ఏజెన్సీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. రోగులు ఎక్కువ మంది కావడంతో ఒకే బెడ్‌పై ఇద్దరు, ముగ్గురు రోగులకు వైద్యం అందిస్తున్నారు. ఇదే అవకాశం చేసుకున్న ఆర్‌ఎంపి వైద్యులు ఏజెన్సీ ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. సాధారణ జ్వరమైనప్పటికీ అనేక రకాల పరీక్షలు నిర్వహించి వేలకు వేలు బిల్లులు వేస్తున్నారు. అవసరం లేకపోయినా వివిధ పరీక్షల పేరుతో పరీక్షలు జరిపి ప్రయివేటు ల్యాబ్ నిర్వాహకులు వేల రూపాయలు ఫీజు తీసుకుంటున్నారు. డెంగీ పరీక్షకు రూ.800, టైఫాయిడ్‌కు రూ.300, మలేరియాకు రూ.300 చొప్పున వసూలు చేస్తున్నారు. రోగనిర్ధారణ పేరిట గిరిజనులను నిలువునా దోచుకుంటున్నారు. గ్రామాల్లోకి వెళ్లి సేవలు అందించాల్సిన వైద్య సిబ్బంది తూతూ మంత్రంగా వ్యవహరిస్తుండడం, ముందస్తు శానిటేషన్ చర్యలు చేపట్టక పోవడం, జ్వరాలపై అవగాహన కల్పించకపోవడం వల్ల ఆర్‌ఎంపి వైద్యులు భారీగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఆర్‌ఎంపి వైద్యశాలతో పాటు ప్రతి వైద్యశాల కిక్కిరిసిపోయి ఉండడం ఏజెన్సీ గ్రామాల్లోని జ్వరాల తీవ్రతను తెలియచేస్తుంది. గ్రామాల్లో ఒకే ఇంట్లో ఇద్దరు లేక ముగ్గురు జ్వరంతో బాధ పడుతుండడంతో వారి ఉపాధికి కూడా ఆటంకంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి గ్రామాల్లో వైద్యం శిబిరాలు ఏర్పాటు చేసి అధిక నగదు వసూలు చేస్తున్న ఆర్‌ఎంపి వైద్యులపై సంబంధిత జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు.
గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి
ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులు మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి జ్వరాలు తీవ్రతతో బాధపడుతున్నారు. ప్రభుత్వ సేవలు సక్రమంగా అందకపోవడం వల్ల ఆర్‌ఎంపి వైద్యులు ఆశ్రయించి వేలాది రూపాయలు తగలబెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి గిరిజనులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలను కాపాడాలి.
కె.అవినాష్. గిరిజన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
అన్ని గ్రామాల్లో స్ప్రేయింగ్ చేపట్టాలి
వర్షాకాలం సంభవించిన నేపథ్యంలో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ జ్వరాలు తీవ్రతతో ఏజెన్సీ గ్రామాల్లో పెరుగుతుండడం వైద్య సిబ్బంది అన్ని గ్రామాల్లో స్ప్రేయింగ్ చేపట్టాలి. వైద్య సిబ్బంది కేవలం మలేరియా తీవ్రత ఉన్న నాలుగు గ్రామాలకే స్ప్రేయింగ్ చేపడతామ నడం సమంజసం కాదు. వైద్య సిబ్బంది తక్షణమే స్పందించి అన్ని గ్రామాల్లో స్ప్రేయింగ్ చేపట్టి దోమలను నివారించి ప్రజలు జ్వరాల బారిన పడకుండా చూడాలి.
ఎం. శ్రీనివాసరావు, సిపిఎం మండల కార్యదర్శి, కురుపాం.










