Aug 02,2023 21:41

జ్వరంతో బాధపడుతున్న హాస్టల్‌ విద్యార్థులు

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : వర్షాకాలం వచ్చిందంటే మన్యంలో ఆందోళనే. గిరిజన ప్రాంతంలో చిన్నారులు, విద్యార్థులు వ్యాధుల బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అపారిశుధ్య వాతావరణం, కలుషిత నీరు, దోమకాటు. దీంతో చిన్నారులు, విద్యార్థులు, మలేరియా, టైఫాయిడ్‌, వైరల్‌ ఫీవర్‌, ఇతర వ్యాధుల బారిన పడి ఆస్పత్రి పాలవుతున్నారు. సకాలంలో సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. కానీ ఐటిడిఎ అధికారులు మాత్రం మరణాల నివారణకు పూర్తిస్థాయి చర్యలు చేపట్టడం లేదు. దీంతో ప్రతి ఏటా వర్షాకాలంలో గిరిజన బాలల మరణాలు ఏదో ఒకచోట సంభవిస్తూనే ఉన్నాయి.
వర్షాకాలం నాలుగు నెలల పాటు గిరిజన గ్రామాల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అనారోగ్యంతో బాధపడుతూ రోగులు నిత్యం వైద్యం కోసం వస్తుంటారు. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలోనే పార్వతీపురం మన్యం జిల్లాలో ఇద్దరు గిరిజన బాలలు జ్వరాలతో బాధపడుతూ మృతిచెందడం కలవరపెడుతోంది. సీతంపేట మండలం పెద్దపల్లంకివలసకు చెందిన బిడ్డిక కార్తికేయ (7) మలేరియా బారిన పడి మృత్యువాత పడ్డాడు. మక్కువ మండలం ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బిడ్డిక మహేంద్ర జ్వరంతో బాధపడుతూ మరణించాడు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు గిరిజన బాలలు మరణించడంతో వారింట విషాదం నెలకొంది.
పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో ఉన్న 55 ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు, సీతంపేట ఐటిడిఎ పరిధిలో 43 ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులు ఏదో ఒక అనారోగ్యం కారణంతో సమీపంలోనే దవాఖానాలకు వైద్యం కోసం వెళుతున్నారు. ఆసుపత్రుల్లో రోజువారీ ఒపి 150 పైనే ఉంటుంది. అందులో 30 మంది వరకు విద్యార్థులే ఉండటం విశేషం. దీనిని బట్టి చూస్తే జ్వరాల తీవ్రత ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. వైద్యం కోసం వస్తున్న విద్యార్థులు జ్వరాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. ఒక్కొక్కసారి రోగుల తాకిడితో మంచాలు చాలక ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురు ఉండాల్సిన పరిస్థితి.
హెల్త్‌ వర్కర్లు లేక సేవలు కరువు
ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో పనిచేస్తున్న హెల్త్‌వర్కర్లను ప్రభుత్వం తొలగించడంతో విద్యార్థులకు స్థానికంగా సేవలు కరువయ్యాయి. దీంతో విద్యార్థులు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రానికి, సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్యం కోసం వస్తున్నారు. పాఠశాల సమయంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు రావడంతో తరగతులకు దూరం కావాల్సి వస్తోంది. మరోవైపు విద్యార్థులకు కండ్ల కలకలు రావడంతో అటు వైద్యం అందక, ఇటు చదువు లేక చివరికి ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి వస్తోంది.
వారం వారం వైద్య పరీక్షలు తప్పనిసరి
ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులకు వారం వారం అధికారులు ఆరోగ్య పరీక్షలు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా మంది విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం కారణంగా రక్తహీనత కనిపిస్తోంది. దీనికితోడు జ్వరం, కడుపు నొప్పి కారణంగా విద్యార్థులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ఆశ్రమ పాఠశాలలో పౌష్టికాహారం విద్యార్థులకు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత ఐటిడిఎ అధికారులపై ఉంది. అయితే వసతిగృహాలపై పర్యవేక్షణ లోపం పూర్తిగా కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వైద్య శిబిరాలు నిర్వహించాలి
మన్యం జిల్లాలో గిరిజన గ్రామాలు, ఆశ్రమ పాఠశాలల్లో వైద్య శిబిరాలు నిర్వహించి, వైద్య సేవలు అందించాలి. మందులు పంపిణి చేయాలి. ఆశ్రమ పాఠశాలలో హెల్త్‌ వర్కర్‌ పోస్టులను భర్తీ చేయాలి.
- కోలక అవినాష్‌,
ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి
రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి
మక్కువ :
జ్వరంతో మరణించిన విద్యార్థి మహేంద్ర కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న శాశ్వత ఎఎన్‌ఎం పోస్టు వెంటనే భర్తీ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు డి.పండు అధికారులను డిమాండ్‌ చేశారు. బుధవారం మండలంలోని ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బిడ్డిక మహేంద్ర సరైన వైద్యం అందక పోవడం వల్లే మరణించాడని అభిప్రాయపడ్డారు. పోషకాహారం అందించకపోవడం వల్ల విద్యార్థులు ఇక్కడ తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించి, ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో టి.ప్రవీణ్‌, కె.వెంకటస్వామి పాల్గొన్నారు.