Mar 26,2023 00:20

అనంతగిరిలో మాట్లాడుతున్న జెడ్‌పిటిసి గంగరాజు

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌ :బోయ/వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఖండిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు మండలాల్లో శనివారం ఆందోళనలు మిన్నంటాయి. సిపిఎం, గిరిజన సంఘం, టిడిపి నేతలు ర్యాలీలు, రాస్తారోకోలు చేపట్టారు. తీర్మానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు.
ప్రజాశక్తి -పాడేరు :జీఓ 3 రిజర్వేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేయడంలో లేని శ్రద్ద బోయ/వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్పించడానికి జగన్‌ ప్రభుత్వానికి తొందర ఎందుకని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్శ ప్రశ్నిచారు. గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పాడేరులో ఆర్‌టిసి కాంప్లెక్స్‌ ఆవరణలో ర్యాలీ చేపట్టి ప్రభుత్వ దిష్ట బొమ్మకు శవ యాత్ర నిర్వహించారు.తలార్‌ సింగ్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ప్రభుత్వ దిష్టి బొమ్మ శవ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అక్కడ నుండి ర్యాలీగా పాడేరు అర్‌.టి.సి కాంప్లెక్స్‌ చేరుకొని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్శ మాట్లాడుతూ, బీసీ ఏ జాబితాలో ఉన్న బోయ/వాల్మీకిలను ఎస్టీ జాబితాలో కలిపితే గిరిజనులకు ఉద్యోగ, ఉపాధ్యాయ, ఉపాధి రంగంలో నష్టం ఉంటుందని, రాజకీయ భవిష్యత్తు కూడా గిరిజనులకు ఉండదని తెలిపారు. జీవో 3 రిజర్వేషనుపై గిరిజన సలహా మండలిలో తీర్మానం చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడానికి అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేయడంలో లేని శ్రద్ధ, వీరిని ఎస్టీ జాబితాలో చేర్పించడంలో తన రాజకీయ ప్రయోజన పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షడు పి లక్కు, సిఐటియు జిల్లా కార్యదర్శి వి.ఉమమహేశ్వరరావు, సిపిఎం మండల కార్యదర్శి ఎల్‌. సుందర్‌రావు, పోతురాజు, శంకర్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాపారావు, మత్యారాజు పాల్గొన్నారు.
మరో పోరాటం తప్పదు :గంగరాజు.
అనంతగిరి:బోయ/వాల్మీకిలను ఎస్‌టి జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని వెనక్కి తీసుకోకుంటే మరో పోరాటం తప్పదని అనంతగిరి జడ్పీటీసీ దీసరి గంగరాజు హెచ్చరించారు. మండల కేంద్రంలోని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అనంతగిరి జడ్పీటీసీ దీసరి గంగరాజు మాట్లాడుతూ,జగన్మోహన్‌ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేయడంతో గిరిజన ద్రోహి గా మిగిలిపోతారన్నారు.రాయలసీమ పాంతంలో 40 లక్షల జనాభా కల్గిన బోయ వాల్మీకిలు నాన్‌ షెడ్యూల్‌ ప్రాంతంలో నివసిస్తూ (బీసీ-ఏ) జాబితాలో ఉన్నారని వారికీ ఎటువంటి ప్రత్యేక భాషా, ఆచారాలు, సాంప్రదాయలు లేవన్నారు. వీరిపై ఉన్న అత్యుత్సాహం, ప్రేమ గిరిజనుల రక్షణ కవచంగా జిఓ -3 పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్‌ వేసేందుకు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. గిరిజన సంఘం మండల కార్యదర్శి జన్ని సుబ్బారావు, సోమేల నాగులు, అనంతగిరి వైస్‌ సర్పంచ్‌ పాంగి అర్జున్‌, వంతల బుద్రయ్య, సొవెరి వెంకటరావు, జన్ని బుజ్జిబాబు, జన్ని అప్పారావు, గోవర్ధన్‌ పాల్గొన్నారు.
అరకులోయ రూరల్‌:బోయ/వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్‌ చేశారు. శనివారం అరకు లోయ మండల కేంద్రంలోని గిరిజన సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ప్రభుత్వం డిగ్రీ కళాశాల నుండి అరకువేలి అంబేద్కర్‌ జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించి నాలుగు రోడ్డు జంక్షన్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ, రాజ్యాంగా బద్దంగా 5వ షెడ్యూల్లో ప్రాంతంలో ఆదివాసులకు కల్పించిన రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తూ సిఎం జగన్మోహన్‌ రెడ్డి తీర్మానం చేయడం దుర్మార్గమన్నారు. గిరిజన ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న జీవో 3 పునరుద్దరణ చేసి గిరిజన ప్రాంతంలో బ్యాక్‌ లాగ్‌ పోస్టులు, స్పెషల్‌ డిఎస్సి, జాబ్‌ క్యాలెండర్‌ వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు, ఆదివాసి పరిరక్షణ సమితి జిల్లా కార్యదర్శి చట్టూ మోహన్‌, జనసేన పార్టీ అధికార ప్రతినిధి మాదల శ్రీరామ్‌, జనసేన నాయకులు దురియా సాయిబాబు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సమర్డి బాబురావు, టిడిపి మండల అధ్యక్షులు శెట్టి బాబురావు, సమర్డి మొసియా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ముంచింగిపుట్టు:మండల కేంద్రంలోని వారపు సంతలో
గిరిజన సంఘం మండల కార్యదర్శి ఎంఎం శ్రీను ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా లక్మిపురం సర్పంచ్‌ కె.త్రినాధ్‌, మండల వైస్‌ ఎంపీపీ1 సత్యనారాయణ మాట్లాడుతూ, బోయ, వాల్మీకిలను ఎస్‌టి జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో పెట్టిన దుర్మార్గపు తీర్మానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏ సామాజిక తరగతినైనా ఎస్‌టి జాబితాలో చేర్చాలంటే పలు కమిటీల నిబంధనల ప్రకారమే చేయాలన్నారు.బోయ, వాల్మీకులకు ఆదివాసీ తెగలతో వారికి ఎటువంటి సంబంధం, పోలికలు లేవన్నారు.వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ విధంగా ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా అధికార పార్టీ గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసి గిరిజన మనుగడను కాపాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె నర్సయ్య, మండల కార్యదర్శి ఎంఎం శ్రీను, పి భీమరాజు, లైకోన్‌, దోంబ్రు, చందరయ్య, కొండయ్య, ఉప సర్పంచ్‌ గణపతి పాల్గొన్నారు.
పెదబయలు :మండల కేంద్రంలో సిపిఎం, టిడిపి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొండా సన్నిబాబు మాట్లాడుతూ,వైసీపీ ప్రభుత్వం 2024లో అధికారం కోసం ఇటువంటి తీర్మానాలు చేస్తుందని విమర్శించారు. అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం తీర్మానాన్ని విరమించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు బొండా గంగాధరం, కుర్ర నర్సయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు వెచ్చంగి కొండయ్య, మాజీ ఎంపీపీ సేకరి వెంకటేష్‌, ఎంపీటీసీ బొంజుబాబు పాల్గొన్నారు
వైసిపికి తగిని బుద్ధి చెబుతాం
రాజవొమ్మంగి : బోయ,వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన వైసిపికి గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు హెచ్చరించారు. గిరిజన సంఘం ఆధ్వర్యాన శనివారం రాజవొమ్మంగిలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి కొండ్ల సూరిబాబు, అధ్యక్షులు కె.జగన్నాథం, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, ఆదివాసీ సంఘం నాయకులు బాలకృష్ణ, తాము సూరిబాబు, రాజు, శ్రీను, పాపారావు, బాబురావు పాల్గొన్నారు.
పలు చోట్ల రాస్తారోకోలు
చింతూరు : ఎస్టీ జాబితాలో చేర్చే తీర్మానం అసెంబ్లీలో పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన సంఘం జిల్లా నాయకుడు మడకం చిన్నయ్య ఆధ్వర్యంలో మండలంలోని లక్కవరంలో గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు.లక్కవరం గ్రామస్తులు వీరయ్య, హరీష్‌, నితిన్‌, ముత్తయ్య, అశోక్‌, గణేష్‌ పాల్గొన్నారు.
ఎటపాక : ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి, ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా గిరిజన సంఘం మండల అధ్యక్షుడు కాకా అర్జున్‌ దొర మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు.సంఘం నాయకులు బుద్దుల భద్రయ్య, సవలం రాము, నక్క సూరిబాబు పాల్గొన్నారు.
సీలేరు : ధారకొండ ఎంపిటిసి అపరంగి బుజ్జిబాబు ఆధ్వర్యాన జీకే వీధి మండలం శ్యామ గెడ్డ గ్రామంలో నిరసన తెలిపారు.
విఆర్‌.పురం:ప్రభుత్వం తీర్మానాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు హెచ్చరించారు. మండల కేంద్రం రేఖపల్లిలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం లక్ష్మి, సర్పంచ్‌లు సరోజిని, వెట్టి లక్ష్మి, సిపిఎం నాయకులు వడ్లది రమేష్‌, ప్రకాష్‌ రావు, కుంజ నాగిరెడ్డి, పులి సంతోష్‌ కుమార్‌, ప్రదీప్‌ కుమార్‌ పాల్గొన్నారు.