Oct 23,2022 23:29

తెల్లని పరదాలో సీలేరు రిజర్వాయర్‌, డ్యామ్‌

కార్తీకానికి ముందే కట్టిపడేస్తున్న అపురూప దృశ్యాలు
ప్రజాశక్తి -సీలేరు:
మన్యంలో మంచుఅందాలు స్థానికులతోపాటు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. జీకే వీధి మండలం సీలేరులో మంచు అపురూప దశ్యాలు చూపరుల మనసులను దోచుకుంటున్నాయి. ఆదివారం ఉదయం రిజర్వాయర్‌ పరిసర ప్రాంతాల్లో చల్లటి చలిగాలులతో మంచు అందాలు మైమరిపిస్తూ సుపరులకు ఎంతో ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించాయి.ఏడు గంటల వరకు సూర్యుడు వెలుగులు కాన రాలేదు. శీతాకాలం ప్రారంభం కావడంతో ఒకేసారి వాతావరణం లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. .నిన్న మొన్నటివరకు ఒక ప్రక్క అధిక ఉష్ణోగ్రత, మరోపక్క కుండపోత వర్షాలతో అల్లాడిన ప్రజలు, మంచు తెరలు కప్పేసిన ప్రకృతి, చల్లని చిరుగాలులు వీస్తూ, అపుడే అధికమైన చలిగాలులు ప్రజలను అపుడే బెంబేలెత్తిస్తున్నాయి.
సీలేరు పరిసర ప్రాంతాల్లో కొండలు కోనలు, రిజర్వాయర్‌ మంచు కమ్మేసిన దృశ్యాలు కాశ్మీర్‌, ఊటీలను తలపిస్తు మధురానుభూతిని కలిగిస్తున్నాయి. ఈనెల 26 నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుండడంతో సీలేరు, దారకొండ పరిసర ప్రాంత మంచు అందాలు ప్రకృతి ఒడిలో రమణీయమైన అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. సీలేరు నుంచి లంబసింగి ఘాట్‌ రోడ్‌ దిగే వరకు రోడ్డును కానరానంతగా మంచు కమ్మేయడంతో, పగటిపూట సైతం హెడ్‌లైట్ల వెలుగులో వాహనచోదకులు ప్రయాణించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.