ప్రజాశక్తి -అనంతగిరి:మండుతున్న ఎండలు, ఉక్క పోతతో అల్లాడుతున్న ప్రజలకు గురువారం కురిసిన భారీ కుండపోత వానతో ఉపశమనం లభించింది. గెడ్డలు, వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. గత కొద్ది రోజులుగా వర్షాలు కురువక మండు టెండలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. గురువారం మధ్యాహ్నం నుండి 4 గంటల వరకు ఉరుములతో కూడిన భారీ కుండ పోత వాన ఏకధాటిగా కురిసింది. పంట పొలాలలో వరద నీరు చేరింది. ఘాట్ రోడ్డు, శివలింపురం, డముకు, అనంతగిరి, అరుకు ప్రదాన రోడ్డులో వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించింది. రాళ్లు, రప్పలు చేరడంతో రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మండుటెండలలో ఉపాధి, ఇతర పనులు చేస్తున్న రైతులకు కాస్త ఉపశమనం కలిగింది.
పెదబయలు:మండల కేంద్రంలో కుండపోత వర్షం కురిసింది. మధ్యాహ్నం. ఒకేసారి ఉరుములు, మెరుపులు పిడుగు పాటుతో వర్షం కురిసింది. దీంతో పంట పొలాల్లో సంపూర్ణంగా నీరు చేరింది. ఇటుకల పండుగ. పూర్తి కావడంతో గిరిజన రైతులు నూతన. విత్తనాలు సిద్ధం చేశారు. ఈ వర్షంతో పోడు వ్యవసాయంపై దృష్టి సారించునున్నారు.
అరకులోయ రూరల్:అనంతగిరి మండలం బీసుపురం ఘాట్ రోడ్ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం భారీ కుండపోత వర్షం కురిసింది. దీంతో రెండు గంటల పాటు జనజీవనం స్తంభించి పోయింది. రెండు గంటలు ఏకధాటిగా కురిసిన భారీ వర్షం కారణంగా బీసుపురం ఘాట్ రోడ్డుపై వరద నీరు నిలిచి పోవడంతో వాహన చోదకులు రెండు గంటల పాటు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం కారణంగా బీసుపురం పరిసర ప్రాంతాల కొండ కాలువల్లో వర్షపు నీరు పొంగి ప్రవహించింది.
పొలాలు జలమయం
మండలంలోని సుంకరమెట్ట పంచాయితి పరిధిలో గురువారం మధ్యాహ్నం కురిసిన భారీ కుండపోత వర్షానికి పంట పొలాలు జలమయమయ్యాయి. వర్షానికి సంఘంవలస గ్రామానికి చెందిన వంతాల డేవిడ్ అనే గిరిజనుడుకు చెందిన రెండు ఎకరాల్లో వరదనీరు చేరడంతో సాగు చేసిన పంటలకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్ట పరిహారాన్ని ఇచ్చి ఆదుకోవాలని కోరారు.










