ప్రజాశక్తి-పాడేరు:అల్లూరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. శుక్రవారం పాడేరు డివిజన్ లోని 11 మండలాల్లోనూ విరామం లేకుండా వర్షం కురిసింది. అనంతగిరి మండలంలో అత్యధికంగా 66.5 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది. కొయ్యూరు మండలంలో 40.7 మిల్లీమీటర్లు, పాడేరులో 32.3 మిల్లీమీటర్లు, డుంబ్రిగూడలో 22.5, అరకు వ్యాలీలో 16.5, జి మాడుగులలో 19.4, చింతపల్లిలో 15.3, జీకే వీధిలో 10.5, హుకుంపేటలో 13.3, పెదబయలులో 5.1, ముంచంగిపుట్టు మండలంలో అత్యల్పంగా 1.5 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదయింది. అల్పపీడన ప్రభావం కారణంగానే మన్యంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
అనంతగిరి:గత కొన్ని రోజులుగా మండలంలోని ఎడతెరిపి లేకుండా కుండపోత వాన కురుస్తుంది. రాత్రి, పగలు తేడా లేకుండా వర్షం కుస్తుండటంతో మండల వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాలతో తాటిపూడి జలాశయం, గోస్తని గెడ్డ, ఓనుకొండ గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ గెడ్డలకు అనుకుని ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు ఇంటికి పరిమితం అయ్యారు. నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా, ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్ళాలన్నా వేరే మార్గం లేక ఇంట్లో ఉండవలన పరిస్థితి నెలకొంది.
డుంబ్రిగూడ:మండలంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. వర్షపు నీటితో వీధి కాలువలన్నీ జలమయంగా మారాయి. అరకు వారపు సంతలో పూర్తిగా బురదమయంగా ఏర్పడటంతో వివిధ సరుకులు కొనుగోలు చేయడానికి వచ్చిన గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. మారుమూల గ్రామం నుంచి కూరగాయలు విక్రయించడానికి వచ్చిన గిరి రైతులు తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు పడ్డారు.
హుకుంపేట:మండలంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కుండ పోత వర్షం కురిసింది. మండల కేంద్రంలోని చీడిపుట్టు వంతెన పొంగడంతో మూడు పంచాయతీ ప్రజలకు రాకపోకలకు ఆటంకం కలిగింది.పంట పొలాల్లో నీరు చేరింది. శుక్రవారం పాఠశాలలు తెరవడంతో విద్యార్థులు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.










