Mar 11,2023 00:15

పాడేరులో ప్రచారం చేపడుతున్న కోరెడ్ల రమాప్రభ (ఫైల్‌ పొటొ)

ప్రజాశక్తి - పాడేరు:ఈ నెల 13న జరుగనున్న ఉత్తరాంధ్ర శాసన మండలి ఎన్నికల్లో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభను గెలిపించే ఆలోచనలో ఏజెన్సీ పట్టభద్రులు ఉన్నట్టు అర్థమవుతోంది. ఆమె అల్లూరి జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో ఇప్పటికే ప్రచారం పూర్తి చేశారు. ఆమె మద్దతుదారులు గ్రామగ్రామానా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అన్నిచోట్లా రమాప్రభకు మంచి ఆదరణ లభిస్తోంది.
250 ప్రజా సంఘాలు బలపరిచిన పిడిఎఫ్‌ అభ్యర్థిగా సామాజిక కార్యకర్త, విద్యావేత్త డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభ అందరి నోళ్లలో నానుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సమస్యల ప్రాతిపదికన ఆంశాల వారీగా ఆమె గొంతెత్తిన తీరు అందరినీ ఆలోచింపజేస్తోంది. తనను గెలిపిస్తే ఉత్తరాంధ్ర సమస్యలపై తన వాణిని మండలిలో వినిపిస్తానని ఆమె చెబుతున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాధన, వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ రక్షణ, రైల్వే జోన్‌ సాధన, ఉద్యోగ, ఉపాధ్యాయులను వేధించే సిపిఎస్‌ రద్దుకు ఉద్యమం, నిరుద్యోగుల కోసం ఈ ప్రాంతంలో పరిశ్రమల సాధనకు పోరాటాలే అజెండాగా తనదైన శైలిలో డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభ పని విధానం ఉంది. ఈ విషయాన్నే ఇంటెలిజెన్స్‌ నివేదికలు సైతం తాజాగా రూఢపీర్చడం విశేషం.
రాజకీయ పార్టీలతో విసిగి వేసారిన మేధావులు, పట్టభద్రులు
గత శాసన మండలి ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి గెలిచిన బిజెపి అభ్యర్థి పివిఎన్‌.మాధవ్‌ ఉత్తరాంధ్ర అభివృద్ధికి చేసిన కృషి, తెచ్చిన నిధులూ శూన్యం. ఉత్తరాంధ్రకు అత్యంత కీలక పరిశ్రమగా వెలుగొందుతున్న వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రంలోని బిజెపి అమ్మకానికి పెట్టగా కార్మికవర్గం పోరాడుతుంటే ఆయన చెప్పిన మాటలు విస్మయం గొలుపుతున్నాయి. 'స్టీల్‌ప్లాంట్‌ ఇక్కడే ఉంటుందని కాకపోతే ప్రైవేటీకరణ అవుతుందని' అతడు వ్యాఖ్యానించడం పట్ల ఈ ప్రాంత మేధావులు, కార్మికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రంలో అధికారం వెలగబెడుతున్న వైసిపి మీనమేషాలు లెక్కిస్తూ స్టీల్‌ప్లాంట్‌ వ్యవహారంలో కేంద్ర విధానాన్ని వ్యతిరేకించకుండా దోబూచులాడుతోంది. ఆ పార్టీ తరపున మండలి ఎన్నికల బరిలో ఉన్న సీతంరాజు సుధాకర్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. ప్రజా సమస్యలపై అవగాహన లేదు. ఈ విషయాలపైనా చర్చలు సాగుతున్నాయి. ఉత్తరాంధ్రలోని వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టే గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ నిర్వహణపైనా ఈ ప్రాంతంలో వ్యతిరేకత భగ్గుమంటోంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు వైసిపి వైఫల్యాలను సరైన రీతిలో ఎత్తిచూపడం లేదు. అతనికీ ప్రజా సమస్యలపై పని చేసిన చరిత్ర లేదు. విద్యావేత్తగా చెప్పుకుంటూ నిరుద్యోగుల ఓట్లను కొట్టేసే ప్రణాళికతో ఆయన ఉన్నట్లు పలువురు చెబుతున్నారు.
పిడిఎఫ్‌ అంటేనే విలక్షణత
2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో తొలిసారిగా పిడిఎఫ్‌ అనే పదం వినిపించింది. సామాజిక బాధ్యత, ప్రగతిశీలమైన వ్యక్తుల సమూహంగా పిడిఎఫ్‌కు గణనీయ స్థానం ఉంది. ఐఐటి రామయ్యగా పిలవబడే చుక్కా రామయ్య, ప్రఖ్యాత రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవహారాల విశ్లేషకులు ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌, డాక్టర్‌ గేయానంద్‌, గతంలో రెండు పర్యాయాలు ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో గెలిచి ప్రజల నోట్లో నాలుకలా మారిన ఎంవిఎస్‌.శర్మ, ప్రస్తుత ఎమ్మెల్సీలు వి.బాలసుబ్రహ్మణ్యం, కెఎస్‌.లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు, షేక్‌ సాబ్జీ, వై.శ్రీనివాసుల రెడ్డి సేవలు అందరికీ తెలిసినవే. వారి వారసత్వాన్ని నిలిపే సత్తా కోరెడ్ల రమాప్రభది అని పట్టభద్రులు చెప్పుకుంటున్నారు. 25 ఏళ్లుగా విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పిల్లలు, పెద్దలు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థి, యువజన రంగాల అభివృద్ధికి తన వంతుగా సామాజిక సేవలో పేరొందిన ఆమె వైపునకు అందరి దృష్టీ మరలుతోంది.