దుక్కి దున్నుతున్న రైతులు
ప్రజాశక్తి-పాడేరు టౌన్: ఏజెన్సీలో వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండటంతో సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. గిరిజనులు ఇప్పటికే వేసిన చిరుధాన్యాలు, వేరుశనగ, పసుపు, జొన్న పంటలు ఏపుగా పెరుగుతున్నాయి. మన్యంలో వర్షాలు పడుతుండడంతో రైతులు నారుమళ్లను సిద్ధం చేస్తున్నారు. ఏజెన్సీలో ప్రత్యేకంగా సాగునీటి వసతులు లేక పోవడంతో పంటలన్నీ వర్షాధారంగానే సాగు చేస్తుంటారు. దీంతో, వర్షాలు పడే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు గిరిజన రైతులకు కీలకం. వరి, చోడి సామ, మొక్కజొన్న, వేరుశనగ, పసుపు, అల్లం పంటలు ప్రధానమైనవి. ఏడాదిలో సాగయ్యే పంటల్లో 90 శాతం ఖరీఫ్ లోనే ఉంటుంది. కుటుంబ యావత్తూ వ్యవసాయ పనుల్లో పాలు పంచుకుంటారు.










