ప్రజాశక్తి-పాడేరు: బోయ వాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్‌టి జాబితాలో చేర్చ వద్దని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు పాలికి లక్కు డిమాండ్ చేశారు. ఎస్‌టి జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం నియమించిన వన్ మెన్ కమిషన్ ను వ్యతిరేకిస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో సాయిబాబా గుడి వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఒ-52ను రద్దు చేయాలంటూ జిఒ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోయ, బెంతు, ఒరియాలను ఎస్‌టి జాబితాలో చేర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఇతర కులాలను గిరిజన తెగల జాబితాలో చేర్చితే అసలైన గిరిజనులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు నష్టం వాటిల్లే చర్యలను వెంటనే ఉప సంహరించుకోవాలని లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేయక తప్పదని హెచ్చరించారు. ఈ నెల 22న అన్ని కళాశాలల విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించాలని, ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని గిరిజన సంఘం పిలువునిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.నర్సయ్య, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చిన్నారావు, ప్రభుదాస్ భాస్కరరావు, రమేష్, డేవిడ్, తదితరులు పాల్గొన్నారు.
డుంబ్రిగుడ: బోయ, బొంతు, ఒరియా కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఒను వెంటనే వెనక్కి తీసుకోవాలని స్థానిక గిరిజన సంఘం ఆధ్వర్యంలో అరకు వారపు సంతలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల కార్యదర్శి టి.సూర్యనారాయణ మాట్లాడుతూ, బోయ, బెంతు, ఒరియా కులాలను ఎస్టీ జాబితాలోకి చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం మాజీ ఐఎఎస్ శామ్యూల్ ఆధ్వర్యంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు సరైన నిర్ణయం కాదన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు పి.సురేష్ కుమార్, పి సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.
ముంచంగిపుట్టు: మండలంలో గిరిజన సంఘం అధ్యక్షులు గల్లెల నారాయణ ఆధ్వర్యంలో స్థానిక కళ్యాణ మండపం నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. నాయకులు కొమ్మ పృథ్వీరాజ్, తదితరులు నాలుగు రోడ్ల కుడలి వద్ద జీవో 52 కాపీలను దగ్ధం చేశారు. అనంతరం పృద్వి రాజ్ మాట్లాడుతూ, శనివారం పాడేరులో మన్యంలోని గిరిజన విద్యార్థులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, గిరిజనులు, గిరిజన యువత, నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ, వైసిపి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల మంది గిరజనులకు అన్యాయం చేస్తూ, వారి హక్కులు, చట్టాలకు భంగం కలిగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది బోయ వాల్మీకిలకు గిరిజన జాబితాలో చేర్చేందుకు సిద్ధం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కమిటీ అ్యక్షుడు నారాయణ, గిరిజన సంఘం పూర్వ జిల్లా అధ్యక్షుడు బి.సన్నిబాబు, సిటిటియు కార్యదర్శి భీమరాజు, గిరిజన సంఘం నాయకులు త్రినాధ్, లైకోన్, జినాబంధు, సీతారాం, గేన్ను పాల్గొన్నారు.
అరకులోయ రూరల్: జీఓ 52 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యాన అరకులోయ మండల కేంద్రంలోని నాలుగు రోడ్డు జంక్షన్ ప్రధాన రహదారి వద్ద నినాదాలు చేస్తూ జిఓ కాపీలను దగ్ధం చేశారు. వైసిపి ప్రభుత్వం గిరిజనుల వ్యతిరేక విధానాలు అమలు చేస్తుందని గిరిజన సంఘం మండల కార్యదర్శి పాంగి రామన్న తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ప్రభుత్వానికీ గిరిజన ఆదివాసీ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పారు. రాష్ట్ర ఎస్టీ కమీషన్ ఛైర్మన్, గిరిజన ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై తమ గళం విప్పి ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల అధ్యక్షులు గత్తుం బుజ్జిబాబు, సీపీఎం మండల కార్యదర్శి కె రామారావు, సీఐటియు మండల కార్యదర్శి పి బాలదేవ్, గిరిజన సంఘం నాయకులు కె.జగన్నాథం, కె.రమేష్, కె.బుజ్జిబాబు, తదితరులు పాల్గొన్నారు.
ఐటిడిఎ వద్ద నిరసన
ప్రజాశక్తి-రాజవొమ్మంగి:బోయ, వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చొదని, ఇందుకు సంబంధించిన జిఒ 52 రద్దు చేయాలని కోరుతూ గిరిజన సంఘం ఆధ్వర్యాన శుక్రవారం రంపచోడవరం ఐటిడిఎ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం జిఒ 52 కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోత రామారావు మాట్లాడుతూ ఓట్ల కోసం ఆదివాసీలకు ద్రోహాన్ని తలపెట్టి వైసీపీ దొంగ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. బోయ వాల్మీకి, బెంతో వోరియలను గిరిజన జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిసన్‌ను రద్దు చేయాలని కోరారు. రాయలుసీమ ప్రాంతంలో ఎక్కువగా నివసించే బోయలను, వాల్మీకి బోయలుగా చిత్రీకరించి వారిని షెడ్యూల్ తెగలుగా గుర్తించేందుకు కమిటీలు వేయడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు ఇ.సిరిమల్లి రెడ్డి, ఎం.వాణిశ్రీ, రంపచోడవరం మండల నాయకులు టి శ్రీను,పి.వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కొయ్యూరు : మండల కేంద్రంలో బోయ వాల్మీకులను, బేంతో, ఓరియా, కులస్తులను గిరిజన జాబితాలో చేర్చేందుకు వైసీపీ ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ రద్దు చేయాలని కోరుతూ 52 జిఓ కాపీలను గిరిజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు ఎస్.సూరిబాబు మాట్లాడుతూ 40 లక్షల మంది బోయ వాల్మీకులు, బెంతో ఒరియా బీసీ తెగలను గిరిజనుల్లో విలీనం చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం సభ్యులు గుంజుగడ్డ చిన్న బాబు, రీముల శ్రీను, సత్తిబాబు, నాని, సీఐటీయూ నాయకులు వై అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.










