ప్రజాశక్తి -అనంతగిరి:మండలంలోని బుధవారం ఉరుములతో కూడిన గాలివాన బీభత్సం కారణంగా పలుచోట్ల భారీ వృక్షాలు విరిగిపడ్డాయి.కొండిభ పంచాయతీ పరిధి బోరిబోరి వలస గ్రామంలో భారీ మామ్మిడి చెట్టు ఇంటి సమీపంలో కూలి పోయింది. దీంతో, ఇళ్లల్లో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రోడ్డుకు అడ్డంగా చెట్టు విరిగి పడటంతో వాహనాల రాకపోకలకు అంతరయం ఏర్పడింది.
కూలిన ప్రహరీ గోడ
మండలంలో కురిసిన గాలివాన బీభత్సంతో లుంగపర్తి పంచాయతీ దిగువ పట్టి ఎంపీపీ పాఠశాల ప్రహరీ గోడ కుప్ప కూలింది. పనులలో నాణ్యత లేక పోవడంతోనే గోడ నిర్మాణం చేపట్టి రెండేళ్లయినా కాకుండానే వర్షానికి దెబ్బతిని కూలి పోవడంతో గ్రామ ప్రజలు మండిపడ్డారు. సెలవు దినాలు కావడంతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది.
జి.మాడుగుల: మండలంలో గెమ్మెలి పంచాయతీ ఊడపాలెంలో బుధవారం వీచిన భారీ ఈదురు గాలులకు భారీ వృక్షం నేల కూలింది. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ శాఖాధికారులు స్పందించి సరఫరా నిలిపివేశారు. రహదారిపై వృక్షం పడడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.










