Oct 08,2022 23:17

అనంతగిరి మండలం అస్తవ్యస్తంగా మారిన పూతీకపుటు రోడ్డు

ప్రజాశక్తి -అనంతగిరి:గత వారం రోజుల నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా మారుమూల గ్రామల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. అలాగే కొండచరియలు విరిగి పడ్డాయి. గెడ్డలు పొంగి ప్రవహిస్తుండటంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం మండలంలో కురిసన కుండపోత వానకు మారుమూల కివర్ల పంచాయతీ పూతీకపుటు గ్రామం రోడ్డు, గెడ్డ దెబ్బతింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచి పోయాయి. పర్యాటక ప్రాంతమైన బొర్రా గుహలు సమీపంలో రైల్వే గేటు మలుపు వద్ద రోడ్డుపై కొండ చరియలు విరిగి పడ్డాయి. ఘట్‌ రోడ్డులో పలు చోట్ల రాళ్లు రోడ్డుపై పడిపోవడంతో రాకపోకలకు పర్యాటకులు ఇబ్బంది పడ్డారు. అనంతగిరి పంచాయతీ పరిధి లక్ష్మీపురం నుండి రాజుపాక, అరకు మొయిన్‌ రోడ్డు నుండి బారజోల, పెద్దురు నుండి మాలింగ్‌వలస, రేగం, నందిగుమ్మి, పెదబయలు మొయిన్‌ రోడ్డు, తెలరాపాడు, తేనెపుటు, లుంగపర్తి పంచాయతీ పరిధి రాళ్ల గెడ్డ నుండి కుభర్తి, చీడివలస, ఎగ్గుపట్టి, దిగువపట్టి నుండి కివర్ల పంచాయతీ బొంగిజా, అలాగే గుమ్మ పంచాయతీ పెదబిడ్డ, వేంగడ, రొంపలి, ఎన్‌ఆర్‌ పురం తదితర పంచాయతీ గ్రామాల రోడ్లు వర్షాలకు రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. దీంతో ఆయా గ్రామాలకు ద్విచక్ర వాహనాలు, ఆటోలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
తాటిపూడి డ్యామ్‌కు ఆనుకుని ఉన్న బీంపోలు, కాశీపట్నం, చిలకలగెడ్డ, రొంపలి, విజయనగరం జిల్లా అడ్డాతీగల పంచాయతీ గ్రామాల ప్రజలు, రైవాడ డ్యామ్‌కు ఆనుకుని ఉన్న లుంగపర్తి, .జీనబాడు, విజయనగరం ఆండ్రా డ్యామ్‌ పరిధి గరుగుబిల్లి, గుమ్మకొట గ్రామాల ప్రజల రాకపోకలు స్తంభించి పోయాయి. కనీసం ఇంట్లో నుండి బయటికి వెళ్లి నిత్యావసర సరుకులు తెచ్చుకోలేని పరిస్థితితో ఇబ్బందులు పడుతున్నారు.

సీలేరులో కుండపోత వర్షం
సీలేరు
జీకే మండలం సీలేరు, పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఎన్నడూలేని విధంగా కుండపోత వర్షం కురిసింది. దీంతో వీధులు, రోడ్లు జలమయమయ్యాయి. కాలువలు పొంగి ప్రవహించాయి. ఉదయం నుంచి ఎండకాయగా, మధ్యాహ్నం మేఘాలు ఒక్కసారిగా కమ్ముకొని భారీ వర్షం కురిసింది. దీంతో దుర్గాదేవి సన్నిధిలో అన్న సమారాధనకు కొంత అంతరాయం ఏర్పడింది. భోజనం చేసే భక్తులు అనేక ఇబ్బందులు గురయ్యారు. ఒంటిగంట నుంచి రెండున్నర గంటల వరకు ఏకధాటిగా వర్షం కురిసింది.