ప్రజాశక్తి-పాడేరు టౌన్: ఐటిడిఎ పరిధిలోని పాడేరు డివిజన్ 11 మండలాల్లోని 16 పరీక్షా కేంద్రాల్లో సిసి కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా జరిగేందుకు చర్యల్లో భాగంగా ఐటిడిఎలో అధికారులు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆయా పరీక్షా కేంద్రాల్లోని సిసి కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి పరీక్షలు జరిగే విధానాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. ఐటిడిఎకు శనివారం ఉదయం 9 గంటలకే చేరుకున్న టిడబ్ల్యూ డిడి ఐ.కొండలరావు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తొలి రోజు పరీక్షలో సీలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థి, చింతపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో ఆరుగురు విద్యార్థులు మాస్ కాపీయింగ్ పాల్పడుతున్నట్టు వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించిన ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలక్రిష్ణ ఆ విద్యార్థులను డిబార్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ విద్యార్థులను అధికారులు డిబార్ చేశారు. మన్యంలో ఎన్నడూ లేని విధంగా చూచిరాతలకు అడ్డుకట్ట వేసేందుకు ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలక్రిష్ణ , అధికారులు తీసుకున్న చర్యలను పలువురు అభినందిస్తున్నారు.ప్రస్తుతం పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి.










