ప్రజాశక్తి-పాడేరు టౌన్: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు డివిజన్ పరిధిలో కనిష్ట ఉష్ణోగ్రతలతో మన్యం ప్రాంతమంతా తీవ్రమైన చలి నెలకొంది. గత రెండు రోజుల నుంచి పాడేరు, అరకులోయ, చింతపల్లి ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైంది. ఈ సీజన్ లో ఇదే అతి తక్కువ డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అని వ్యవసాయ పరిశోధన కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఆదివారం చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో 1.5, సోమవారం 2 డిగ్రీలు నమోదు కాగా, పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డులో ఆదివారం 6, సోమవారం 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 5 నుంచి చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 10 గంటల వరకు ఏజెన్సీలోని అన్ని ప్రాంతాల్లోను పొగమంచు దట్టంగా కురుస్తోంది. పొగమంచుతో పాటు చలిగాలులు వ్యాపిస్తుండటంతో ప్రజలు, పర్యాటకులు తీవ్రమైన చలితో ఇబ్బందులు పడుతున్నారు. పాడేరు పట్టణంలో పలుచోట్ల ప్రజలు చలిమంటలను ఆశ్రయించారు. పొగ మంచు దట్టంగా వ్యాపించడంతో లైట్లు వేసుకుని చోదకులు వాహనాలను నడుపు తున్నారు.
దట్టంగా కురుస్తున్న మంచు
పెదబయలురూరల్: మండలంలో గత రెండ్రోజుల నుండి చలి తీవ్రత పెరిగింది. పర్రెడ ప్రాంతంలోని వరి పొలాలు, కుప్పలపై మంచు గడ్డలు దర్శనం ఇచ్చాయి. ఉదయం 10గంటలు దాటినా మంచు వీడకపోవడంతో జనాలు బయటకు రాలేదు.










