
ప్రజాశక్తి-పెదబయలురూరల్:మండలంలో సోమవారం వర్షం కురిసింది. ఈ వర్షంతో పొట్ట దశలో ఉన్న ధాన్యం, ఇతర వాణిజ్య పంటలకు ఊరటం కలిగిందని చెప్పుకోవచ్చు. తుపాన్ మొదలైతే రైతులకు తీరని నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతగిరి:వాయుగుండం ప్రభావంతో సోమవారం మండలంలోని కుండపోత వాన కురిసింది సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన భారీ కుండపోత వర్షం అర్ధరాత్రి వరకు ఏకధాటిగా కురిసింది.వ్యవసాయ పంటలతో పాటు పప్పు దినుసులు పంట చేతికొచ్చిన సమయంలో వర్షాలకు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాలలో రైతులు కోతల అనంతరం నూర్పులు చేస్తున్నారు. మరి కొన్ని ప్రాంతాలలో కోతలకు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో రైతులు లబోదిబో మంటున్నారు.
మారేడుమిల్లి: గత కొన్ని రోజులుగా ఎండ వేడిమి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చెంది సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మండలంలో ఎడతెరిపి లేకుండా ఉరుములు మెరుపులు కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడంతో జనాలు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి కొండ కాలువలు పొంగి పొర్లి, లోతట్టు గ్రామాలకు వెళ్లే రహదారులు జలమయమయ్యాయి.
సీలేరు: జీకే వీధి మండలం సీలేరులో సోమవారం అతి భారీ వర్షం కురిసింది. దుర్గావీధి లోతట్టు ప్రదేశాలు జలమయమయ్యాయి. డ్రైనేజీల్లో నీరు పొంగి ప్రవహించాయి. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఉన్నప్పటికీ, మధ్యాహ్నం ఈదురుగాలులతో సీలేరు పరిసర ప్రాంతాల్లో గంటపాటు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. బజార్ మెయిన్ రోడ్‌లో వర్షపునీరు పొంగి ప్రవహించింది. ఆంధ్రాఒడిశా సరిహద్దులో గుంటువాడ సమీపంలో కోసిన వరి పంట పొలాలు తడిసి ముద్దయ్యింది.