Apr 23,2023 00:32

హుకుంపేటలో విరిగిన చెట్ల కొమ్మలు

ప్రజాశక్తి-పాడేరుటౌన్‌: ఉదయమంతా ఎండ... మధ్యాహ్నమైతే వర్షం ఇలా.. గత కొద్ది రోజులుగా అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో కొనసాగుతుంది. శనివారం కూడా పాడేరులో వర్షం కురిసింది. సుమారు గంటకు పైగా భారీ వర్షం కురిసింది. పాడేరులో ఉదయం నుంచి ఎండ తీవ్రత నెలకొంది. ఉదయం 9 గంటల నుంచి ఎండ తీవ్రత మొదలై సాయంత్రం 3 గంటల వరకు కొనసాగింది. ఎండ తీవ్రతకు భయపడి మధ్యాహ్న వేళల్లో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం భయపడుతున్నారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని గంటకు పైగా వర్షం కురిసింది. దీంతో ఎండ దాటికి అల్లాడిపోతున్న ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.
హుకుంపేట: మండల కేంద్రంలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. మండల కేంద్రంలో చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. రోడ్డు పక్కన చెట్ల కొమ్మలు పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఐదు గంటలసేపు కరెంటు సరఫరా నిలిచి పోయింది.
జిమాడుగుల: మండల కేంద్రంలో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షం పడింది. సుమారు మూడు గంటలసేపు కురిసిన ఈ వర్షంతో వివిధ పనులపై మండల కేంద్రానికి వచ్చిన గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో రోడ్డు సరిగ్గా కనిపించక పోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపో యాయి. చిన్న కాలువల సైతం పొంగి పొర్లాయి. కొద్ది రోజుల క్రితం నుండి ఏజెన్సీలో వింత వాతావరణం నెలకొంటుంది. ఉదయం వేళ చలి, మధ్యాహ్న సమయంలో ఎండ, సాయంత్రం వేళ తీవ్ర వర్షాలు పడుతున్నాయి.