ప్రజాశక్తి-చింతూరు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. చింతూరులో వడగళ్లతో కూడిన భారీ వర్షం పడింది. వర్షం సందర్భంగా వీచిన గాలికి కూనవరం, చింతూరు రెండు మండలాల మధ్య సీతారాంపురం వద్ద రహదారిపై భారీ వృక్షం నేలకూలింది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎటపాక మండలంలోనూ రోడ్లపైనా, పంట పొలాల్లోనూ భారీ వడగళ్ల వాన కురిసింది. వడగళ్ల రాళ్లతో నిండిపోయి కాశ్మీర్ మంచును తలపించింది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన వాన ఏడు గంటల వరకు ఏకధాటిగా కురవడంతో వాతావరణ ఒక్కసారిగా చల్లబడింది. గాలి వర్షానికి విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. సుమారు మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కురిసిన అకాల వర్షానికి మామిడి పూత నేలరాలి పోయింది. ఈ సంవత్సరంలో వడగళ్లతో కూడిన వాన భారీ స్థాయిలో కురవడం ఇదే ప్రథమం.
గోడ కూలి ఉపాధ్యాయుడు మృతి
గాలి వానకు గోడ కూలి ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర సుకుమా జిల్లా కుంట గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు జగన్ మృతి చెందాడు. చింతూరు మండలం చిడుమూరు పంచాయతీ పరిధి శుద్ధ గూడెం గ్రామంలో ఇటుక బట్టి ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం పెద్ద గాలి దుమారంతో వర్షం కురవడంతో ఇటుక బట్టి వద్ద ఏర్పాటు చేసిన షెడ్డులో జగన్ ఉన్నారు. ఈ క్రమంలో షెడ్డుకు ఉన్న ద్వారబంధంతో సహా గోడ కూలి ఆయన మీద పడటంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే గ్రామస్తులు కుటుంబీకులు చింతూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఉపాధ్యాయుడు మృతి చెందాడు. దీంతో కుంట గ్రామంలో విషాదఛాయలు అనుముకున్నాయి.
సీలేరు : జీకే వీధి మండలం సీలేరులో గురువారం మధ్యాహ్నం చిరుజల్లులు కురిశాయి. ఉదయం నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా, ఒక్కసారిగా వాతావరణం మారి మబ్బులతో కూడిన వాతావరణం ఏర్పడింది. అనంతరం ఉరుములతో కూడిన చిరుజల్లు సీలేరు పరిసరాల్లో కురిశాయి. ఆంధ్ర ఒడిశా సరిహద్దు చిత్రకొండ, గుంటవాడలో భారీగా వర్షం కురిసింది. నెల రోజులుగా ఉష్ణోగ్రతతో అల్లాడుతున్న ప్రజలు చిరుజల్లు కురవడంతో వాతావరణం చల్లబడి ప్రజలు సేదతీరారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుతో పాటు సీలేరు పరిసర ప్రాంతాల్లో మబ్బులతో కూడిన చల్లటి వాతావరణం నెలకొనడంతో ప్రజలు ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందారు.
పెదబయలు : మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు కుండ పోత వర్షం కురిసింది. ఉదయం విపరీతమైన. ఎండ కాసింది. మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములు, మెరుపుల శబ్దాలతో వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.
అనంతగిరి : ఎండల ఉక్కపోతతో మండలవాసులు అల్లాడుతున్న తరుణంలో ఒక్కసారిగా కుండ పోత వాన కురవడంతో స్థానికులకు ఉపశమనం పొందారు. గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వడగళ్ల వాన కురిసింది. వరి పంట వేసిన రైతులు పంట పొలాల్లో వర్షపు నీరు చేరడంతో ఆనందం వ్యక్తం చేశారు.










