ప్రజాశక్తి-విఆర్.పురం, కొయ్యూరు
మన్యం ప్రాంతం అంటే చల్లగా ఉంటుందని అందరూ భావిస్తారు. అందుకు భిన్నంగా ఏజెన్పీలోనూ భానుడు భగభగ మండిపోతున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండలకు వడగాలులు, ఉక్కపోత తోడు కావడంతో జనం విలవిలలాడిపోతున్నారు.
ఉదయం 8 గంటలకే సూర్య ప్రతాపం మొదలవుతోంది. 10 గంటల నుండి ఎండ తీవ్రత పెరుగుతూ మధ్యాహ్నం సమయానికి భానుడు నిప్పులు కక్కుతున్నాడు. సాయంత్రం 4 గంటలైనా ఎండ తీవ్రత తగ్గడం లేదు. సాయంత్రం ఐదారు గంటల వరకు వడగాల్పుల ప్రభావం ఉంటోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండు వేసవిలోనూ చల్లని వాతావరణంతో ఆకట్టుకునే విఆర్.పురం మండలంలో ఇటీవల కాలంలో అత్యధికంగా 41 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం విఆర్.పురం, కొయ్యూరు ప్రాంతాల్లో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండవేడి, వడగాలులను తట్టుకోలేక ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు.
గత వారంలో ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం వరకు ఎండ మండించినా సాయంత్రానికి వర్షం కురవడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందేవారు. అయితే గత రెండు మూడు రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకొని వర్షాలు కురవడం లేదు. మరో వైపు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మన్యంలో ఉండే పచ్చదనం అక్రమార్కుల గొడ్డలి వేటుకు కానరాకుండా పోతుండడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎండల తీవ్రత ఇంకా ఎక్కువగానే ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
వేసవి కాలంలో బయటకు వెళ్లాలంటే తగిన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎవరైనా బయటకు వెళ్లాలంటే తలకు తప్పనిసరిగా వస్త్రం కట్టుకోవాలి. తమ వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి. పిల్లలు, వృద్ధుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని పనులు సాధ్యమైనంత వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే పెట్టుకోవాలి. ముఖ్యంగా ఎండ కాలంలో నీటిని అధికంగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఫ్రూట్ జ్యూస్‌తో పాటు నిమ్మరసాలు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకుంటే ఎండల నుంచి ఉపశమనం పొందవచ్చని వివరిస్తున్నారు.
గతంలో కొయ్యూరు మండల కేంద్రంలో రెండు నుంచి ఐదు చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు. అయితే ఈ సంవత్సరం ఎక్కడా చలివేంద్రం కానరాకపోవడంతో మండలంలో నడిచి వెళ్లే పాదచారులు మంచినీళ్ల కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మండల కేంద్రంలో చలివేంద్రం ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. మండల కేంద్రాల్లో మజ్జిగ, మంచినీళ్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సిపిఎం విఆర్.పురం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు అధికారులను డిమాండ్ చేశారు.










