Mar 18,2023 23:54

సీలేరులో వర్షంలో పరుగులు పెడుతున్న విద్యార్థులు

ప్రజాశక్తి-సీలేరు: అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంతోపాటు సీలేరు పరిసరాల్లో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసాయి. శనివారం ఉదయం 9 గంటల వరకు మబ్బులతో కూడిన వాతావరణం, అనంతరం మధ్యాహ్నం రెండు గంటల వరకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపాడు. తర్వాత వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుని, సాయంత్రం నాలుగు గంటల సమయంలో వర్షం కురిసింది. సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న విద్యార్థులు తడుస్తూ ఇంటికి పరుగులు తీశారు.
మరోవైపు ఎఒబితోపాటు దారకొండ, గుమ్మరేవులు, దుప్పిలివాడ తదితర ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలతో జీడి,మామిడి పంటకు నష్టం వాటిల్లుతుందని గిరిరైతులు ఆవేదన చెందుతున్నారు. చింతచెట్లు ఫలసాయం చేతికొచ్చే సమయంలో వర్షపు జల్లులు కురుస్తుండడంతో తడిసి నష్టం వాటిల్లుతుందని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు.
పాడేరుటౌన్‌:పాడేరులో వరుసగా రెండో రోజున ముసురు వాతావరణం కొనసాగింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన ముసురు అర్ధరాత్రి తెరిపిచ్చింది. శనివారం సాయంత్రం నాలుగున్నర గంటల తర్వాత వాన గంటసేపు కురిసింది. జన జీవనానికి అంతరాయం ఏర్పడింది.
డుంబ్రిగూడ: మండలంలో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పిడుగు శబ్దాలతో కూడిన ఈదురు గాలుల వర్షం కురిసింది. ఈ వర్షంతో మండలంలో నిర్మిస్తున్న ఎన్‌హెచ్‌ 516 రోడ్డు బురద మయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండల కేంద్రానికి వివిధ పనులు నిమిత్తం వచ్చిన గిరిజనులు తిరుగు ప్రయాణంలో పలు ఇబ్బందులు పడ్డారు. మండల కేంద్రంలోని రోడ్లన్నీ వర్షపు నీటితో జలమయంగా మారాయి.