Sep 03,2023 19:44

అభినందన సభలో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ (ఫైల్‌)

సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. గడచిన నాలుగేళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించిన బొత్స ఇప్పుడు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తన కోటరీ చెక్కుచెదరలేదని నిరూపించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగా గత కొద్ది నెలలుగా బొత్స మన్యం జిల్లాపై దృష్టి సారించడం చర్చనీయాంశమైంది. ఇటీవల కాలంలో జిల్లాలో జరిగిన అధికారిక, అనధికార పార్టీ సమావేశాల్లో బొత్స పాల్గొని తన అనుచరులను కార్యోన్ముఖులను చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అటు విజయనగరం, ఇటు మన్యం జిల్లా లో ఇంతవరకు తన తరపున రాజకీయాలు నడిపిన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుతో పొసగని నేపథ్యంలో సొంత కోటరీ పునర్నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇంతవరకు అధికారపార్టీలో నడిచిన 'వన్‌ మాన్‌ షో' రాజకీయాలకు చెక్‌ పెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం మన్యం జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలకు హాజరవుతూ అనుచరులకు గీతోపదేశం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కొద్దినెలల క్రితం సాలూరు మండలం మామిడిపల్లిలో వైసిపి సీనియర్‌ నాయకులు సువ్వాడ తవుడు విగ్రహావిష్కరణకు ఆయన హాజరయ్యారు. ఆ కార్యక్రమం అనంతరం అదే గ్రామానికి చెందిన వైసిపి మండల సీనియర్‌ నాయకులు సువ్వాడ రమణ మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులను ఇంటికెళ్లి పరామర్శించారు. తర్వాత వృద్దాప్యం రీత్యా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్‌ నాయకులు, మాజీ జెడ్పీటీసీ రెడ్డి తిరుపతినాయుడును బాగువలస వెళ్లి పరామర్శించారు. ఇలా బొత్స ఎక్కడకు వెళ్లినా గతంలో తన అనుచరులుగా ఉన్న వారిని కలుస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వారిని పరామర్శించి ధైర్యం కల్పించడం, మరణించిన నాయకుల కుటుంబ సభ్యులను ఓదార్చడం చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ తన ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. మన్యం జిల్లా మంత్రి, డిప్యూటీ సిఎం రాజన్నదొర ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇప్పటికే ఉన్న గ్రూపు రాజకీయాలు ఉన్నాయి. ఈ గ్రూపుల్లో బలమైన గ్రూపు నాయకులతో మంతనాలు జరుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌ మార్పు అంశం తెరపైకి వస్తోంది. గతంలో చైర్‌పర్సన్‌ ఎన్నిక ముందు పట్టణానికి చెందిన వైసిపి గ్రూపులు పదవి కోసం పోటీ పడ్డాయి. అప్పుడు ఉమ్మడి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, డిప్యూటీ సీఎం రాజన్నదొర సమక్షంలో కుదిరిన ఒప్పందం గడువు సమీపిస్తోంది. రెండున్నర ఏళ్ల తర్వాత చైర్‌పర్సన్‌ను మార్చి ఇంకో వర్గానికి చెందిన మహిళా కౌన్సిలర్‌ను ఆ పదవిలో కూర్చోబెడతామని అగ్రనేతలు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఒప్పందం అమలు చేయాలని పట్టణ వైసిపిలో మరో గ్రూపు నాయకులు పట్టు పడుతున్నారు. దీని కోసం వారు జెడ్పీ చైర్మన్‌, డిప్యూటీ సిఎంలపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ క్రమంలో చైర్‌పర్సన్‌ పదవి ఆశిస్తున్న వైసిపి గ్రూపు నాయకులు మంత్రి బొత్స సత్యనారాయణ ఆశీస్సులు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒప్పందం అమలు కోసం బొత్స వారికి భరోసా ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. రెండు రోజుల క్రితం పార్వతీపురం నియోజకవర్గంలో గడపగడపకూ ప్రభుత్వం ముగింపు కార్యక్రమానికి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. తన అనుచరుడు, ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న బొత్స పార్టీ నాయకులు, కార్యకర్తలను చైతన్యపర్చారు. మన్యం జిల్లా రాజకీయాల్లో తన ముద్ర చెరిగిపోకుండా పూర్వవైభవం సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఏమైనా మన్యం జిల్లా రాజకీయాల్లో రానున్న ఎన్నికల ముందు ఆసక్తి కరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.