Aug 03,2023 21:27

మూతపడిన బ్యాంకులు, వ్యాపార దుకాణాలు, విద్యాసంస్థలు
పలుచోట్ల భారీ ప్రదర్శనలు, మానవహారాలు, ధర్నాలు
మణిపూర్‌లో ఆదివాసీలపె పైశాచిక మారణహోమం ఆపాలి : ఆదివాసీలు
ప్రజాశక్తి - యంత్రాంగం

మణిపూర్‌లో ఆదివాసీలపై కార్పొరేట్‌, మతోన్మాద శక్తుల పైశాచిక మారణహోమాన్ని ఆపాలని, బిజెపి తీసుకొచ్చిన నూతన అటవీ సంరక్షణ చట్టాన్ని రద్దు చేయాలని, ఏజెన్సీలోని ఖాళీ పోస్టులను స్థానిక ఆదివాసీలతోనే భర్తీ చేయాలని కోరుతూ గురువారం చేపట్టిన ఏజెన్సీ బంద్‌ విజయవంతమైంది. ఆదివాసీ గిరిజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ బంద్‌లో గిరిజనులు, ఆదివాసీలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాపార దుకాణాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సహకరించారు. పలుచోట్ల భారీ ప్రదర్శనలు, మానవహారాలు చేపట్టారు.
బుట్టాయగూడెం : మణిపూర్‌లో ఆదివాసీ మహిళలపైన, గిరిజనులపై మారణ హోమాన్ని ఆపాలని, ఆదివాసీ, గిరిజన సంఘాలు సంయుక్తంగా బుధవారం చేపట్టిన మన్యం బంద్‌ విజయవంతమైంది. మండల కేంద్రంతో పాటు పలు ప్రధానకేంద్రాల్లో బంద్‌ కొనసాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి నెహ్రూ బొమ్మ కూడలి వరకూ భారీ ప్రదర్శన, అనంతరం మానవహారం నిర్వహించారు. మణిపూర్‌లో ఆదివాసీలపై కార్పొరేట్‌, మతోన్మాద శక్తుల పైశాచిక మారణ హోమాన్ని ఆపాలని, బిజెపి చేపట్టిన నూతన అటవీ సంరక్షణ చట్టాన్ని రద్దు చేయాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీ పోస్టులను స్థానిక ఆదివాసీలతో భర్తీ చేయాలని, బోయ, వాల్మీకులను గిరిజనుల జాబితాలో చేర్చొద్దని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ బంద్‌కు ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షులు కారం భాస్కర్‌ అధ్యక్షత వహించారు. ఈ ధర్నానుద్దేశించి ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ మణిపూర్‌లో ఆదివాసీలపై మతోన్మాద శక్తుల పైశాచికత్వాన్ని ఆపాలన్నారు. అక్కడి విలువైన అటవీ సంపద, మైనింగ్‌ను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించేందుకు అడ్డుగా ఉన్న ఆదివాసీలను అడవి నుండి గెంటివేయాలనే కుట్రలో భాగంగా ఈ మారణ హోమాన్ని సృష్టించడం బాధాకరమన్నారు. మూడు నెలలుగా జరుగుతున్న ఈ దారుణాలకు ఆదివాసీల ఇళ్లు, ఆస్తులు, చర్చిలు ధ్వంసమయ్యాయన్నారు. ఆదివాసీ మహిళల మానప్రాణాలపై దాడి చేస్తూ నేటికీ మణిపూర్‌ తగలబడుతూనే ఉందన్నారు. ఇప్పటికి 160 మందికిపైగా ప్రజలు చనిపోయారని వేలాది ఇళ్లు, చర్చిలు నేలకూలాయన్నారు. బిజెపి ప్రభుత్వ వివిధ తెగల మధ్య మత విభేదాలు సృష్టిస్తూ కాలయాపన చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి మణిపూర్‌లో శాంతిని నెలకొల్పాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ నూతన అటవీ సంరక్షణ చట్టం 1980ను నేటి వర్షాకాల పార్లమెంట్‌ సమావేశంలో సవరించి ఆదివాసీ గ్రామసభకు ఉన్న అధికారాన్ని రద్దుచేశారన్నారు. నూతన అటవీ సంరక్షణ చట్టం అమలైతే అడవుల్లో కార్పొరేట్‌, మైనింగ్‌ మాఫియాలు ఆదివాసీలను అడవి నుండి బలవంతంగా గెంటి అధికారం పొందే ప్రమాదం ఉందన్నారు. మన రాష్ట్రంలో గిరిజనేతర బోయ, వాల్మీకులకు ఎస్‌టి హోదా కల్పించి మరో మణిపూర్‌లా మార్చాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేస్తున్నాయని, దీన్ని ఆదివాసీలు ఐక్యంగా అడ్డుకోవాలన్నారు.
సిఐటియు జిల్లా కార్యదర్శి మొడియం నాగమణి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఉడత వెంకటేష్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ త్యాగం చేసిన నిర్వాసితులపట్ల లేదన్నారు. ఇప్పటికీ నిర్వాసితులకు పరిహారం, ప్యాకేజీ పూర్తిగా ఇవ్వలేదన్నారు. మరోపక్క వరదలు వస్తున్నా ముందస్తు సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ జాప్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని విద్యాసంస్థలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఈ ధర్నాలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు చుండ్రు బుల్లెమ్మ, కొయ్యల శ్రీను, సిహెచ్‌.పోతురాజు పాల్గొన్నారు.
వేలేరుపాడు : మణిపూర్‌లో ఆదివాసీలపై కార్పొరేట్‌ మతోన్మాదశక్తుల పైశాచిక దాడులను ఆపాలని నిరసిస్తూ మన్యం బంద్‌లో భాగంగా మండలంలోని గుల్లవాయి జంక్షన్‌లో ఆదివాసీ జెఎసి ఆధ్వర్యాన రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసనకు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ధర్మల రమేష్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జెఎసి నాయకులు, గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు కారం ధారయ్య, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మడివి దుర్గారావు, గిరిజన సంక్షేమ పరిషత్‌ మండల అధ్యక్షులు మిర్యాల శ్రీను, ఎఎస్‌పి నాయకురాలు సునీత మాట్లాడుతూ మణిపూర్‌లో ఆదివాసీ మహిళలను నగంగా ఊరేగించి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి మణిపూర్‌లో దాడులను ఆపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కారం వెంకటరావు, గిరిజన సమైక్య మండల అధ్యక్ష, కార్యదర్శులు, పిట్ట వీరయ్య, కట్ట వెంకటేశ్వర్లు, ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి మడకం ఏసుబాబు, కె.ప్రకాష్‌, గిరిజన సంక్షేమ పరిషత్‌ మండల కార్యదర్శి బంధం ప్రసాద్‌, రజిని, పి.రాంబాబు, ఆదివాసీ మహాసభ నాయకులు రాంబాబు, సత్తిబాబు ఉన్నారు.
కుకునూరు: మండల కేంద్రం కుక్కునూరులో గిరిజన సంఘం, గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల కార్యదర్శి పట్ల లక్ష్మయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు ఎస్‌.లక్ష్మణరావు, గిరిజన సమాఖ్య నాయకులు వరసా నాగేశ్వరరావు, పాపారావు, బాబూరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్రరావు పాల్గొన్నారు
జీలుగుమిల్లి : మణిపూర్‌లో ఆదివాసీలపై మతోన్మాద శక్తుల మారణ హోమాన్ని ఆపాలని, జిఒ3ను చట్టబద్ధం చేయాలని, బోయ, వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చొద్దని, అటవీ హక్కుల చట్టాన్ని యథాతధంగా అమలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంఘాలు చేపట్టిన మన్యం బంద్‌ విజయవంతమైంది. మండల కేంద్రంలో వ్యాపార సముదాయాలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఉదయం నుంచి ఆయా సంఘాల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బంద్‌ను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని, వారి చట్టాలకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు తెల్లం దుర్గారావు, కొండలరావు, సిరిబత్తుల సీతారామయ్య, అప్పారావు, భీమశంకరం, వెంకటేశ్వరావు పాల్గొన్నారు.