
ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : మణిపూర్ ఆదివాసీలపై కార్పొరేట్, మతోన్మాద శక్తుల పైశాచిక మారణహెమాన్ని ఆపాలని ఆదివాసి గిరిజన సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఏజెన్సీ బంద్ పార్వతీపురం మన్యం జిల్లాలో విజయవంతమైంది. ఇందులో భాగంగా గుమ్మలక్ష్మీపురంలో బంద్ ప్రభావంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గుమ్మలక్ష్మీపురం, ఎల్విన్ పేట గ్రామాల్లో వర్తక, వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఆటోలు, ట్రక్కర్ల యజమానులు, రిక్షా కార్మికులు బంద్‌కు సహకరించారు. ఆదివాసి గిరిజన సంఘం నాయకులు ఎల్విన్ పేట నుంచి గుమ్మలక్ష్మీపురం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో మణిపూర్‌లో కుకి, నాగ గిరిజన జాతులపై గిరిజనేతరులైన మైతీలతో దాడులు చేయిస్తూ మారణ హౌమం సృష్టిస్తుందని అన్నారు. మరోవైపు కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ బాక్సెట్ తవ్వకాలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తుందన్నారు. రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కులు, చట్టాలకు రక్షణ లేకుండా చేస్తుందని అన్నారు. మణిపూర్‌లో ఆదివాసీలపై కార్పొరేట్, మతోన్మాద శక్తుల మారణ హౌమం ఆపాలని, ఆ రాష్ట్ర సిఎం బీరేన్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నూతన అటవీ సంరక్షణ చట్టాన్ని రద్దు చేయాలని, గ్రామ సభలకు అధికారాలివ్వాలని డిమాండ్ చేశారు. గిరిజనులను అడవి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం కోసమే నూతన అటవీ సంరక్షణ చట్టం తీసుకువచ్చిందన్నారు. గిరిజనుల సాగులో ఉన్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు నూరు శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించే జిఒ 3కు చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి అసెంబ్లీ తీర్మానాన్ని రద్దు చేయాలని, నాన్ షెడ్యూల్డ్ ఏరియా గ్రామాలను ఐదో షెడ్యూల్డ్ ఏరియాలో కలపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం కోశాధికారి మండంగి రమణ, మండల నాయకులు పువ్వల మోహన్ రావు,సన్యాసిరావు, బిడ్డిక ఆడిత్, బిడ్డిక శంకర్రావు తదితరులు ఉన్నారు.

సీతంపేట : మణిపూర్ ఆదివాసీలపై మారణ హౌమం ఆపాలని తలపెట్టిన మన్యం బంద్ మండలంలో విజయవంతమైంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బందు ఏకధాటిగా కొనసాగింది. గిరిజన సంఘం నాయకులు దోనుబాయి జంక్షన్ నుండి సంత మార్కెట్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సీతంపేటలో షాపులు, దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ బంద్‌కు ప్రజలు సహకరించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు ఎం.తిరుపతిరావు, జిల్లా అధ్యక్షులు ఎం.లక్ష్మణరావు, మండల నాయకులు బి.సాయి, శ్రీరాములు, సాంబయ్య, భాస్కరరావు, గంగాధర్ పెద్దఎత్తున గిరిజనులు పాల్గొన్నారు.

బెలగాం : మణిపూర్‌లో మారణహోమం ఆపాలని గిరిజన సంఘం నాయకులు కె.రామస్వామి, డి.సీతారాం ఆధ్వర్యంలో పెద్దఎత్తున మహిళలు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గిరిజన మహిళల అత్యాచారానికి, హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.
కురుపాం : మణిపూర్‌లో ఆదివాసీలపై జరుగుతున్న దాడులకు బాధ్యత వహిస్తూ మణిపూర్ సిఎం వెంటనే రాజీనామా చేసి మారణహౌమం ఆపాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు స్థానిక రావాడ జంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోలక లక్షణామూర్తి, గిరిజన సంఘం జిల్లా సలహాదారుడు బి.కూర్మా రావు,గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి.తిరుపతిరావు, గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షులు ఆరిక చంద్రశేఖర్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పల్ల సురేష్, గిరిజన సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున గిరిజనులు పాల్గొన్నారు.
పాచిపెంట : ఎపి ఆదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి జెన్ని రామయ్య, జిల్లా కమిటీ సభ్యులు మంచాల శ్రీనివాసరావు, సూకురు అప్పలస్వామి, ఆదివాసీి గిరిజన ఐక్యవేదిక జిల్లా నాయకులు పడాల తమ్మయ్య ఆధ్వర్యంలో మన్యం బంద్ మండల కేంద్రమైన పాచిపెంటలో ప్రశాంతంగా జరిగింది. ఈ బంద్‌కు ప్రజలంతా సంఘీభావం తెలిపారు. విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగానే మూసివేసి సంఘీభావం తెలిపారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు, చింత పోలిరాజు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు కొర్ర అర్జున్, పాముల సన్యాసి, సుయ్యారి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
కొమరాడ : గిరిజన సంఘం రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చిన మన్యం బంద్ మండల కేంద్రంలో ప్రశాంతంగా జరిగింది. గురువారం మండల కేంద్రంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో కొమరాడ మెయిన్ రోడ్డు వద్ద భారీగా ర్యాలీ అనంతరం నిరసన మండల కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఈమరక రామారావు, ఊయిక వెంకటేష్, ఊయిక రామస్వామి మాట్లాడారు. కార్యక్రమానికి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, గౌరునాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శివుని నాయుడు, బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. గిరిజన ప్రజలు మరియు జూనియర్ కాలేజ్ మరియు హైస్కూల్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సాలూరు రూరల్ : ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో మండలంలోని మామిడిపల్లిలో నిర్వహించిన బంద్ విజయంతమైంది. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు వంతల సుందరరావు, గెమ్మెల జానకిరావు మాట్లాడారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు, ఆదివాసీ గిరిజన సంఘం మండల కమిటీ సభ్యులు కూనేటి చినబాబు, జోగారావు తదితరులు పాల్గొన్నారు.










