ప్రజాశక్తి-పాడేరుటౌన్: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు ఏజెన్సీలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాడేరు మండలంలోని వంజంగి హిల్స్ ఆదివారం పర్యాటకుల తాకిడితో కిటకిటలాడింది. వేకువ జామున మంచు అందాల మధ్య సూర్యోదయం దృశ్యాలు, ప్రకృతి అందాలను వీక్షించేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వంజంగి హిల్స్‌కు చేరుకున్నారు. తెల్లవారుజామున పాల సముద్రంలా కనిపించే మేఘాలు చూడ ముచ్చటగా ఉండే దృశ్యాలను తిలకించారు. వంజంగి శిఖర ప్రాంతాలలో ఉదయం 9 గంటల వరకు కొండల నిండా మంచు తెరలు కనివిందు చేశాయి. జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం తిలకించేందుకు సందర్శకులు పోటెత్తారు. ఈ ప్రకృతి అందాన్ని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి పర్యటకులు పెద్ద సంఖ్యలో వచ్చి సందడి చేశారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా జలపాతం వద్ద తడుస్తూ సందడి చేశారు. జలపాతం అందాలను కెమెరాలో బంధించేందుకు, సెల్ఫీలతో యువతీ యువకులు హంగామా చేశారు. వంజంగి హిల్స్, కొత్తపల్లి జలపాతం పర్యటకులతో కిటకిటలాడాయి.










