Aug 31,2023 23:47

సమావేశంలో మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ప్రభావతి

* ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ప్రభావతి
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: 
మహిళలపై జరుగుతున్న దాడులకు సంఘటితంగా ప్రతిఘటించడం ద్వారానే అడ్డుకోగలమని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి అన్నారు. నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఐద్వా నాయకులు లక్ష్మి 32వ వర్థంతిని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలపై హింస ప్రతిఘటన అన్న అంశంపై మాట్లాడారు. దేశ వ్యాప్తంగా మహిళలపై దాడులు ఆకృత్యాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కులం, మతం పేరుతో దాడులు పెరుగుతున్నాయని, ఈ దాడులను మనువాద శక్తులు అండగా నిలుస్తూ మహిళలపై దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఐక్యతతో ఎదుర్కోవాలన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న రోలింగ్‌ను నివారించే మార్గాలు కనుక్కోవాలన్నారు.
ఒకవైపు భారత మాతాకీ జై అంటూనే... భారత మహిళలపై దాడులు చేయడం అన్యాయమన్నారు. మహిళలు కేవలం వంటింటికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నారు. మహిళా సంఘం జిల్లా కన్వీనర్‌ అల్లాడ లక్ష్మి మాట్లాడుతూ గృహహింస మొదలు సామూహిక దాడులు, అత్యాచారఘటనలు, హత్యలు పెరిగిపోతున్నాయన్నారు. వీటిని అరికట్టాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయన్నారు. శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ కె.నాగమణి మాట్లాడుతూ ఇంటా, బైటా ఎంతో చాకిరి చేస్తున్న మహిళలకు గుర్తింపు లేదన్నారు. ఐద్వా నాయలకులు శ్రీదేవి పాణిగ్రహి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో డిగ్రీ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ కె.సూర్యచంద్రరావు, మహిళా సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఎం.లలిత, డిగ్రీ కాలేజ్‌ తెలుగు విభాగా అధిపతి జ్యోతిలక్ష్మి, బాటనీ లెక్చరర్‌ ఎస్‌.రుద్రమరాణి, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, అంగన్వాడీ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం జిల్లా అధ్యక్షులు వి.జి.కె.మూర్తి, లక్ష్మి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.