Sep 10,2023 23:09

సమావేశంలో నాయకులు

ప్రజాశక్తి-తాడేపల్లి : బిజెపి ప్రభుత్వం తీసుకొస్తున్న మనువాద భావజాలానికి వ్యతిరేకంగా కళారూపాలు తయారు చేసి ప్రజల్ని చైతన్యవంతం చేయాలని ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.అనిల్‌కుమార్‌ అన్నారు. ప్రజానాట్య మండలి గుంటూరు జిల్లా సమావేశం తాడేపల్లిలోని పిఎన్‌ఎం రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఎస్‌.పద్మ అధ్యక్షత వహించారు. అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ మనువాద సిద్ధాంతాన్ని తీసుకొచ్చి దేశాన్ని వేల సంవత్సరాలు వెనక్కి నెడుతున్నారని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ తీరును విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలన్నారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలు, ఆస్తి పన్ను, చెత్త పన్ను, పట్టణ సంస్కరణలను వ్యతిరేకిస్తూ గేయాలు రూపొందించాలని కళాకారులను కోరారు. ఈ సందర్భంగా కమిటీ తీసుకున్న నిర్ణయాలను పిఎన్‌ఎం జిల్లా కార్యదర్శి దేవరకొండ శ్రీనివాస్‌ తెలిపారు. అక్టోబర్‌ 4 నుంచి 8 వరకు వడ్డేశ్వరంలో జరిగే రాష్ట్రస్థాయి శిక్షణా శిబిరానికి గుంటూరు, మంగళగిరి నుంచి రెండు టీమ్‌లు పాల్గొనే విధంగా చూడాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్ర రాజకీయ బస్సు జాతా అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 2 వరకు జిల్లాలో తిరిగే సందర్భంగా వివిధ రకాల కళా ప్రదర్శనలు ఇవ్వాలని నిర్ణయించారు. నవంబర్‌ 7వ తేదీ విజయవాడలో జరిగే భారీ బహిరంగ సభలో కోలాటాలు, డప్పులు, జానపద నృత్యాలతో ప్రదర్శన నిర్వహించాలని తీర్మానించినట్లు చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గాదె సుబ్బారెడ్డి, నాయకులు నాయకులు ఎం.రవి, ఆర్‌వి రాఘవయ్య, పి.ప్రసాద్‌, రాజ్యలక్ష్మి, ఎం.శ్రీను పాల్గొన్నారు.