దోశలు అంటే ఇష్టం ఉండని వారు ఉండరు. అయితే దోశల్లోనూ అనేక రకాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా దోశలు వేస్తుంటారు. సాధారణంగా మనకు తెలిసినవి ఉల్లి దోశ, ఉప్మా దోశ, మసాలా దోశలు. అయితే ఇవి కాక మరికొన్ని బాగా ప్రాచుర్యం పొందిన వెరైటీ దోశలూ ఉన్నాయి.. వాటిల్లో మైసూర్ మసాలా దోశ, కడప కారందోశ, వెజిటబుల్ దోశల ఇలా.. రొటీన్‌కి భిన్నంగా ఎప్పుడైనా బయటకు వెళ్లినప్పుడు హోటళ్లలో తింటుంటాం. ప్రస్తుత చల్లటి వాతావరణంలో కారం.. కారంగా.. ఆహార ప్రియుల మనసును 'దోశే' ఇలాంటి వెరైటీ దోశలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..!
మైసూర్ మసాలా దోశ
కావాల్సిన పదార్థాలు : అట్టు పిండి కోసం - మినపప్పు-1/2 కప్పు, ఇడ్లీ బియ్యం-కప్పు, దోశల బియ్యం-కప్పు, మెంతులు-టీస్పూన్, పచ్చి శనగపప్పు-2 టీస్పూన్లు, మందమైన అటుకులు-1/2 కప్పు, ఉప్పు- రుచికి సరిపడా, నూనె-అట్టు కాల్చడానికి, వెన్న -తగినంత.
కారం కోసం - కాశ్మీరి ఎండు మిరపకాయలు-15 (వేడినీళ్లలో నానబెట్టినవి)
పచ్చి శనగపప్పు-2 టీస్పూన్లు, ఉల్లిపాయ తురుము -1/4 కప్పు, నువ్వులు- టీస్పూన్, వెల్లుల్లి-5, 6 రెబ్బలు, పసుపు-1/8 టీస్పూన్, ఉప్పు- తగినంత, నిమ్మరసం- టీస్పూన్, నూనె-2 టీస్పూన్లు,
ఆలూ మసాలా కోసం - నూనె-3 టీస్పూన్లు, ఆవాలు-టీస్పూన్, పచ్చి శనగపప్పు-టీస్పూన్, జీలకర్ర-టీస్పూన్, కరివేపాకు- రెబ్బ, ఉల్లిపాయ తురుము- కప్పు, అల్లం వెల్లులి ముద్ద-1.5 టీస్పూన్, పసుపు-1/4 టీస్పూన్, ఉడికించిన బంగాళాదుంపలు-4, నీళ్లు-1/4 కప్పు, కొత్తిమీర తరుగు-1/4 కప్పు, పచ్చిమిర్చి తరుగు -2 టీస్పూన్లు.
తయారుచేసే విధానం : అట్టు పిండి కోసం ఉంచిన పదార్థాలన్నీ కడిగి కనీసం ఐదు గంటలు నానబెట్టుకోవాలి. తరువాత గ్రైండర్లో అన్నీ వేసి, తగినన్ని నీళ్లు చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని కనీసం 12 గంటల పాటు పులవనివ్వాలి. తరువాత తగినంత పిండి తీసుకుని, అందులో రుచికి సరిపడా ఉప్పు, నీళ్లు చేర్చి పలుచన చేసి పక్కనుంచుకోవాలి.
కారం కోసం నూనె వేడిచేసి, అందులో శనగపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి. ఇందులో ఉల్లిపాయ తరుగు, నువ్వులు వేసి ఉల్లిపాయ మెత్తబడే దాకా వేపుకోవాలి. ఆఖరున వెల్లులి వేసి వేపుకున్నాక దింపేయాలి.
మిక్సీజార్లో నానబెట్టిన మిరపకాయలు, వేపుకున్న ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి మిరపకాయలు నానబెట్టిన నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
ఆలూ కూర కోసం నూనె వేడిచేసి అందులో ఆవాలు, శనగపప్పు, కరివేపాకు వేసి వేపుకోవాలి. తరువాత ఉల్లిపాయ తరుగు వేసి 2-3 నిమిషాలు వేపి, అల్లం వెల్లులి ముద్ద, పసుపు ఉప్పు వేసి రెండు నిమిషాలు వేపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ఆలుగడ్డలని మెదపాలి. ఆలూ పైన కాసిని నీళ్లు చిలకరించి దుంపలు పీల్చుకునే దాకా వేపి, చివర్లో కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు వేసి కలిపి దింపేసుకోవాలి.
అట్టు వేసేముందు అట్ల పెనంపై నూనె వేసి ఉల్లిపాయతో బాగా రుద్ది మిగిలిన నూనెని తుడిచేయాలి. అట్టు పిండి పోసి పలుచుగా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి పోసిన వెంటనే మధ్యలో కారం పేస్ట్ వేసి అట్టంతా రాయాలి. అట్టు అంచుల వెంట నూనె వేసి, మధ్యలో వెన్న వేసి అట్టుని అట్ల కాడతో కదపకుండా ఎర్రగా కాలనివ్వాలి. అట్టు ఎర్రగా కాలాక మధ్యలో ఆలూ కూర పెట్టి మధ్యకి మడిస్తే.. రుచికరమైన మైసూర్ మసాలా దోశ రెడీ.. అల్లం చట్నీ, కొబ్బరి చట్నీతో తింటే అదిరిపోతుంది.
కడప కారందోశ
కావాల్సిన పదార్థాలు : దోశ పిండి (మైసూర్ మసాలా దోశకు సిద్ధం చేసుకున్న పిండి సరిపోతుంది), కాశ్మీరీ ఎర్రకారం-2 టీస్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు-కప్పు, ఉప్పు-1/2 స్పూన్, చక్కెర-1/2 స్పూన్.
బొంబాయి చట్నీకి - ఉల్లిపాయ ముక్కలు-2 కప్పులు, ఉడికించిన ఆలూ- కప్పు, శనపిండి-2 స్పూన్లు, పసుపు-1/2 స్పూన్, ఉప్పు-రుచికి సరిపడా, నూనె-2 స్పూన్లు, పోపు గింజలు- స్పూన్, పచ్చిమిర్చి-4, కరివేపాకు- 4 రెమ్మలు, కొత్తిమీర-కొద్దిగా, పుట్నాల పప్పులు- కప్పు, కొబ్బరిపొడి-2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం : ముందుగా ఉల్లిపాయ ముక్కలు, ఎండు మిరపకాయలు, ఉప్పు, కొద్దిగా చక్కెర వేసి మెత్తగా చేసుకోవాలి. ఉప్పు చూసి గిన్నెలోకి తీసుకోవాలి.
బొంబాయి చట్నీ - స్టౌపై పాన్‌పెట్టి అందులో నూనె వేసి, వేడయ్యాక పోపు గింజలు వేసి, అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇందులో కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. వేగాక అందులో నీరు కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని పోయాలి. చిక్కబడ్డాక ఉడికించిన ఆలూ వేసి కలిపి, రెండు నిమిషాలు మూతబెట్టి ఉంచాలి. చివరగా కొత్తిమీర చల్లుకోవాలి.
పప్పుల పొడి - పుట్నాల పప్పులు, కొబ్బరి, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీలో పొడి చేసి పెట్టుకోవాలి.
ఒక గిన్నెలోకి దోశ పిండిని తీసుకోవాలి. స్టౌపై దోశ పెనం పెట్టి వేడయ్యాక, దోశ పిండి వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. అంచులపై నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దోశ పైన ఎర్ర కారం రాయాలి. దానిపై పప్పుల పొడి చల్లుకోవాలి. పొడిపైన బొంబాయి చట్నీ వేసుకొని, నెయ్యి వేసుకోవాలి. చివరగా ఉల్లిపాయముక్కలు, టమాటా ముక్కలు వేసి దోశ బాగా కాల్చాలి. దీన్ని మడత వేసి రెండువైపులా కాల్చుకోవాలి. ఈ దోశను పచ్చి కొబ్బరి పచ్చడితో తింటే రుచిగా ఉంటుంది.
వెజిటబుల్ దోశ
కావాల్సిన పదార్థాలు : దోశ పిండి (మైసూర్ మసాలా దోశకు సిద్ధం చేసుకున్న పిండి సరిపోతుంది), ఉల్లిపాయ ముక్కలు- కప్పు (సన్నగా తరిగినవి), క్యారెట్ ముక్కలు-కప్పు, క్యాప్సికం ముక్కలు- కప్పు, కొత్తిమీర తురుము-2 టీస్పూన్లు.
తయారుచేసే విధానం : ముందుగా దోశ పిండిని బౌల్లోకి తీసుకుని, రుచికి తగినంత ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా తరిగిన క్యారెట్, ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలు, కొత్తిమీరను కలిపి పక్కన పెట్టుకోవాలి.
స్టౌపై పెనం పెట్టి, వేడెక్కాక నూనె వేసి ఉల్లిపాయముక్కతో రుద్దాలి. తరువాత పిండి వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైనా ముందుగా కలిపి పెట్టుకున్న కూరగాయల ముక్కలను వేసి, అట్ల కాడతో స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన నూనె/ నెయ్యి వేసి బాగా కాలనివ్వాలి. ఒకవైపు కాలాకా తిరగేసుకోని రెండో వైపూ కాలనివ్వాలి. అంతే రుచికరమైన వెజిటబుల్ దోశ రెడీ. దీన్ని కొబ్బరి చట్నీ / టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.