Sep 13,2023 18:27

ప్రజాశక్తి - భీమడోలు
   మండలంలోని లక్ష్మీపురంలో మనస్తాపానికి గురై వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయమై నలుగురు నిందితులను అదుపులోనికి తీసుకుని భీమడోలు కోర్టుకు బుధవారం హాజరు పరిచినట్లు ఎస్‌ఐ చావా సురేష్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు లక్ష్మీపురం గ్రామానికి చెందిన లక్ష్మణరావు అనే ఆక్వా రంగ కార్మికునికి పావనితో 2007వ సంవత్సరంలో వివాహమైంది. వీరికి 9, 8 తరగతులు చదువుతున్న బాలుడు, బాలిక సంతానంగా ఉన్నారు. గత నెల 15వ తేదీన ద్వారకాతిరుమల వెళ్లేందుకు బయలుదేరిన పావని మార్గమధ్యంలో ఒకరిని లిప్టు అడిగి ఆయన బైక్‌పై బయలుదేరారు. బైక్‌పై వెళుతున్న పావనిని అదే గ్రామానికి చెందిన పాత నేరస్థుడు బోను శివకృష్ణ వీడియో తీశారు. దీనిని తన స్నేహితులైన బోను పవన్‌, సుంకర యశ్వంత్‌, శనపతి రాజబాబులతో షేర్‌ చేసుకున్నారు. వీరు నలుగురు కలిసి బైక్‌పై వెళుతున్న పావనిని అడ్డుకున్నారు. తమతో ఒకరోజు శారీరకంగా గడపాలని ఒత్తిడి తెచ్చారు. లేకుంటే తాము తీసిన వీడియోను వైరల్‌ చేసి తిరుగుబోతుగా అల్లరి చేస్తామని బ్లాక్‌ మెయిల్‌ చేశారు. ఈనెల 10వ తేదీన వారు పావని బైకుపై వెళుతున్న వీడియోను గ్రామంలో వైరల్‌ చేశారు. వ్యభిచారిణిగా ప్రచారం చేశారు. దీనిపై మనస్థాపం చెందిన పావని ఇంట్లో దూలానికి ఉరివేసుకుని బలవర్మరణం పొందారు. మృతురాలి సోదరుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన భీమడోలు ఎస్‌ఐ నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈనెల 13వ తేదీన భీమడోలు కోర్టుకు హాజరుపరచగా కోర్టు నిందితులకు ఈనెల 24వ తేదీ వరకూ రిమాండ్‌ విధించారన్నారు.